మహోపకారి ముహమ్మద్‌

‘తల్లి పాదాల చెంత స్వర్గముంది’, ‘కూలివాని చెమట ఆరకముందే అతని వేతనం చెల్లించండి’, ‘అరబ్బులకు ఇతరులపైగానీ, ఇతరులకు అరబ్బులపైగానీ ఎలాంటి ఆధిక్యతా లేదు’, ‘తోటివాడు ఆకలితో ఉండగా నువ్వు మాత్రమే తింటే ముస్లిమ్‌వే కాదు’, ‘ఆడపిల్లలు స్వర్గానికి బాటలు, వారికీ ఆస్తిలో

Updated : 14 Oct 2021 05:37 IST

అక్టోబర్‌ 19 మిలాదున్నబీ

‘తల్లి పాదాల చెంత స్వర్గముంది’, ‘కూలివాని చెమట ఆరకముందే అతని వేతనం చెల్లించండి’, ‘అరబ్బులకు ఇతరులపైగానీ, ఇతరులకు అరబ్బులపైగానీ ఎలాంటి ఆధిక్యతా లేదు’, ‘తోటివాడు ఆకలితో ఉండగా నువ్వు మాత్రమే తింటే ముస్లిమ్‌వే కాదు’, ‘ఆడపిల్లలు స్వర్గానికి బాటలు, వారికీ ఆస్తిలో వాటా ఇవ్వాలి’, ‘ధార్మికతలో పరిశుభ్రత సగభాగం’- ఇవన్నీ ఇస్లామ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) సూక్తులు. మక్కాలో ఖురైష్‌ వంశానికి చెందిన ప్రవక్త తాను పుట్టకముందే తండ్రిని, ఆరేళ్లప్పుడు తల్లినీ కోల్పోయారు. తాతయ్య పెంపకంలో గొప్పగా పెరిగి, సాదిక్‌ (సత్యసంధుడు), అమీన్‌ (నిజాయితీ పరుడు) బిరుదులు పొందారు. కోపం, కక్షలతో అట్టుడికిన నాటి సమాజాన్ని మార్చేందుకు తపించారు. చుట్టూ జరుగుతున్న అరాచకాలకు ఆందోళన చెందేవారు. రోజుల తరబడి అక్కడి హిరా గుహలో ఉండేవారు. ఒకరోజు దైవదూత ద్వారా ఆయన్ను ప్రవక్తగా ఎన్నుకున్న శుభవార్త అందింది. అలా 23ఏళ్లు సామాజిక జాడ్యాలపై ఉద్యమించి అరబ్‌ సామ్రాజ్య రూపురేఖల్ని మార్చారు. మానవ జాతికి కారుణ్యం అందించేందుకు ముహమ్మద్‌ను ఈ భూమిమీదకి పంపినట్లు ఖురాన్‌లో ఉంది. వెయ్యిన్నర సంవత్సరాలుగా ఆ మహా ప్రవక్త పేరు మారుమోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు పూటల అజాన్‌ పలుకుల్లో, నమాజులో ముహమ్మద్‌ పేరు పఠించి పులకించి పోతారు. కోట్లాది ముస్లిములకు ప్రవక్త ప్రవచనాలు ప్రేరణ. ‘మనుషులంతా ఒక్కటే, మరణానంతర జీవితం ఒకటుంది’ అనే ఆయన నినాదం ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఈ నినాదంతోనే ఆనాటి పగా ప్రతీకారాలను చల్లార్చారు. ఉచ్ఛనీచాలను అంతమొందించారు. జకాత్‌ దానాలను ప్రోత్సహించి ఆర్థిక అసమానతలను రూపుమాపారు. సంపన్నులు తమ ఏడాది సంపదలోంచి రెండున్నర శాతం పేదలకు పంచడమే జకాత్‌. రోజంతా ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నమైనా రాత్రివేళ అల్లాహ్‌ ఆరాధనలో గడిపేవారు. నమాజ్‌కు భక్తిశ్రద్ధలు ముఖ్యమన్నారు. అహంకారం, అసహనం, విద్వేషాలు నెలకొన్నప్పుడు ముహమ్మద్‌ ప్రవక్త బోధనలను ప్రచారం చేయాల్సిన అవసరముంది. అన్ని మతాలవారినీ గౌరవించాలని ఆచరించి చూపారు. ఒకసారి ఆయన ధార్మిక విషయాలు చర్చిస్తున్నారు. అంతలో ఒక యూదుడి శవయాత్ర మొదలైతే వెంటనే ప్రవక్త లేచి నిలబడ్డారు. ‘అది యూదుడి శవం కదా’ అన్నవాళ్లకు ‘ఆయన కూడా మనిషేగా’ అని బదులిచ్చారు. ప్రవక్తగా, భర్తగా, తండ్రిగా, మిత్రుడిగా తనదైన ముద్రవేశారు. కనుకనే ‘ముహమ్మద్‌ ప్రవక్త జీవితం ఆదర్శనీయం’ అని ఖురాన్‌లో ఉంది. ఆ మహనీయుని సదా స్మరించుకుందాం.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని