దయాసాగరి శ్రీమహాలక్ష్మి

దసరా ఉత్సవాలతో కళకళలాడే దక్షిణ భారతదేశ అమ్మ వారి ఆలయాల్లో ప్రసిద్ధమైంది కర్నాటక, తుమకూరు జిల్లా గొరవనహళ్లి శ్రీమహాలక్ష్మి ఆలయం. అమ్మ నామస్మరణతో సర్వ సిద్ధులూ ప్రాప్తిస్తాయి, సకల ఐశ్వర్యాలూ సంప్రాప్తిస్తాయి.

Updated : 14 Oct 2021 06:14 IST

దసరా ఉత్సవాలతో కళకళలాడే దక్షిణ భారతదేశ అమ్మ వారి ఆలయాల్లో ప్రసిద్ధమైంది కర్నాటక, తుమకూరు జిల్లా గొరవనహళ్లి శ్రీమహాలక్ష్మి ఆలయం. అమ్మ నామస్మరణతో సర్వ సిద్ధులూ ప్రాప్తిస్తాయి, సకల ఐశ్వర్యాలూ సంప్రాప్తిస్తాయి. మహిమాన్విత ఆదిశక్తి రూపమే మహాలక్ష్మి. ఆ తల్లి అభీష్ట వర ప్రదాయినిగా, దయాసాగరిగా కొలువైన క్షేత్రమిది.

ప్రతీ ఆలయానికీ భక్తిశ్రద్ధలతో విశ్వసించే చరితలు, స్థలపురాణాలు ఉన్నట్లే గొరవణహళ్లికి కూడా స్థలపురాణం ఉంది. నూట ఇరవయ్యేళ్ల క్రితం ఈ ఊరిలో అబ్బయ్య అనే ఓ పేద రైతు తన గోవులకు నీరు తాగించడానికి తీసుకువెళ్తే ఆ చెరువులోంచి, ‘మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకెళ్లు!’ అంటూ ఓ స్త్రీ కంఠం వినిపించిందట. అలా చెరువులోంచి ఉద్భవించిన స్వయంవ్యక్త అమ్మవారుగా మహాలక్ష్మి అబ్బయ్య ఇంట పూజలందుకునేదట. అతని తమ్ముడు తోటదప్ప చిన్నగుడి కట్టించి పూజలు చేస్తుండగా కమలమ్మ అనే భక్తురాలు ఆ ఆలయాన్ని వృద్ధి చేయించిందట. ఇప్పుడది దేశంలో విఖ్యాత అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధమైందని స్థానికులంటారు.

ప్రతీ మంగళ, శుక్రవారాల్లో వేలాది భక్తులు లక్షకుంకుమార్చన వంటి విశేష పూజలు ఆచరిస్తారు. కార్తీక మాసంలో జరిగే లక్షదీపోత్సవం సందర్భంగా దీప కాంతులలో ఆలయం గొప్పగా వెలిగిపోతుంది.    
బెంగళూరుకు దగ్గర్లో సువర్ణముఖీ నదీతీరాన స్వర్ణకాంతులతో మెరిసే ఈ గుడి దక్షిణభారత శిల్పకళా రీతులతో, దక్షిణాత్యుల ఆలయ ఆగమవాస్తు శైలిలో, లక్ష్మీకళతో దర్శనమిస్తుంది. నాగరశైలీ నిర్మాణరీతిలో గోపుర, ప్రాకారాలు, వాటిపై లతాయుక్తమైన అందాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నాగదేవత అయిన మంచాల నాగప్ప, మరికాంబల ఉప మందిరాలూ ఇక్కడున్నాయి.

రోజూ కుంకుమార్చనలు, మూడుసార్లు మంగళహారతులు వైభవంగా జరుగుతాయి. విమాన లేదా రైలుమార్గాన ఆలయానికి చేరుకోవచ్చు. లేదంటే బెంగళూరు నుంచి సరాసరి గొరవణహళ్లికి అనేక బస్సు సర్వీసులున్నాయి.

- టి.యు. శంకరయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని