అతిపాండిత్యం అనర్థదాయకం

వారణాశి నగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు ఓ వ్యాపార కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆయనకు పండితుడు అని పేరుపెట్టారు. పండితుడు పెద్దయ్యాక..

Updated : 21 Oct 2021 05:37 IST

వారణాశి నగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు ఓ వ్యాపార కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆయనకు పండితుడు అని పేరుపెట్టారు. పండితుడు పెద్దయ్యాక.. అతిపండితుడనే మరో వ్యాపారితో కలిసి వర్తకం ఆరంభించాడు. ఇద్దరూ విదేశాలకు వెళ్లి లాభాలు గడించారు. డబ్బు పంచుకొనే సమయంలో తనకు రెండువంతులు రావాలని అతిపండితుడు పేచీపెట్టాడు. ఎందుకని అడిగితే.. ‘నువ్వు కేవలం పండితుడివి. నేను అతిపండితుణ్ని. కనుక నాకు రెండువంతులివ్వడం సమంజసం’ అన్నాడు. ఆశ్చర్యపోయిన పండితుడు ‘బళ్లు, ఎద్దులు, సరకు, పెట్టుబడి, కష్టం అంతా సమానమైనప్పడు లాభం కూడా సమానంగానే ఉండాలిగా’ అని వాదించాడు. కానీ అతిపండితుడు రెండుభాగాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. వివాదం ఎంతకూ తేలకపోవడంతో ‘ఇక్కడున్న వృక్షదేవతనే న్యాయం అడుగుదాం. రేపు మళ్లీ ఇక్కడికొద్దాం’ అన్నాడు అతిపండితుడు. దానికి పండితుడు ఒప్పుకున్నాడు. అతిపండితుడు తన తండ్రిని రాత్రికి చెట్టుతొర్రలో దాక్కుని ఉండి తనకు అనుకూలంగా తీర్పు చెప్పమన్నాడు. మర్నాడు ఇద్దరూ వృక్షదేవత వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించి న్యాయం అడిగారు. చెట్టుతొర్రలో దాక్కొన్న వ్యక్తి గొంతు మార్చి ‘పండితుడికి ఒక భాగం.. అతిపండితుడికి రెండు భాగాలు’ అని చెప్పాడు. పండితుడిగా ఉన్న బోధిధర్ముడు ‘ఈ చెట్టులో ఉంది దేవుడో, దయ్యమో ఇప్పుడే తేలుస్తాను’ అని ఎండుగడ్డి తెచ్చి చెట్టు మొదట్లో నిప్పు పెట్టాడు.

ఆ వేడికి చెట్టు తొర్రలో ఉన్న అతిపండితుడి తండ్రి పెద్దగా అరుస్తూ ‘తప్పయింది క్షమించండి’ అంటూ బయటకొచ్చాడు. ‘పండితుడిగా ఉండటమే మంచిది అతిపండితుడవటం హానికరం. అందుకే నాకీ దుర్గతి పట్టించాడు. వచ్చిన లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవడమే న్యాయం’ అన్నాడు. అతిపండితుడికి జ్ఞానోదయమైంది.. కుటిలత్వంతో పరువు పోవడమే కాక నా అనుకున్నవాళ్లు అపాయంలో పడతారని గ్రహించాడు. లాభాన్ని సమంగా పంచాడు.

- ఎ.ఎం.నాగప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని