అష్ట భైరవుల క్షేత్రం ఆదిచెంచునగరి

‘మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్రభీషణం’ అంటూ కాలభైరవుణ్ని వర్ణించిన ఆదిశంకరాచార్యులు కాలభైరవ దర్శనం మోక్షదాయకమన్నారు. అలాంటిది అష్టభైరవుల అపూర్వ ఆలయం మాండ్యా జిల్లా ఆదిచెంచునగరిలో, బెంగళూరుకు ...

Updated : 28 Oct 2021 06:10 IST

మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్రభీషణం’ అంటూ కాలభైరవుణ్ని వర్ణించిన ఆదిశంకరాచార్యులు కాలభైరవ దర్శనం మోక్షదాయకమన్నారు. అలాంటిది అష్టభైరవుల అపూర్వ ఆలయం మాండ్యా జిల్లా ఆదిచెంచునగరిలో, బెంగళూరుకు వంద కి.మీ.ల దూరంలో ఉంది. మూడున్నర వేల అడుగుల ఎత్తయిన కొండమీద దాదాపు అరవై కోట్ల రూపాయలతో నిర్మించిన నల్లగ్రానైట్‌ ఆలయం. చుట్టూ ఉన్న అడవినిండా నెమళ్లే.

శివుడు, అష్టభైరవులు, స్థంభాంబిక, సుబ్రహ్మణ్యస్వామి, గణేశులు కొలువై సాక్షాత్తు కైలాసంలాే వెలుగులీనుతుంది. చుంఛ, కంఛ అనే రాక్షసులను సంహరించిన పరమశివుడు ఇక్కడ వెలిశాడంటారు. స్తంభాలపై వివిధ దేవతల ఆకృతులున్నాయి.

కాలభైరవుడంటే నల్లనివాడు, ఉగ్రరూపుడు కాదు, కాలశక్తి భైరవుడు. కాలుడి శక్తిని నియంత్రించే కాలచక్ర భైరవుడు. ఈ కాలభైరవుడు శివుని వేలి గోరునుంచి ఉద్భవించి బ్రహ్మ ఐదో శిరస్సుని ఖండించి గర్వమణిచిన శివస్వరూపుడు. గర్భాలయానికి ముందున్న ముఖమంటప స్తంభాలకు ఎనిమిది కాలభైరవ విగ్రహాలుంటాయి. గర్భాలయంలో వెండిమకరతోరణం కింద స్వర్ణకవచంతో త్రిశూలం, ఢమరుకాలు, బ్రహ్మ ఖండిత శిరస్సు, మెడలో రుద్రాక్షలు, పుష్పమాలలు, పక్కన శునకరాజంతో మహాస్వర్ణ కాలభైరవుడుంటాడు.

ముఖమంటపంలో స్తంభాలపై 17 అడుగుల ఎత్తైన అష్టాంగ భైరవుడు, రురుభైరవ, ఛండభైరవ, క్రోధభైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణభైరవ, సంహార భైరవ- ఇలా 8మంది కాలభైరవులు ఒకేచోట దర్శనమివ్వటం విశిష్టం. వీరు స్వర్ణకాలభైరవుని పర్యవేక్షణలో ఎనిమిది దిక్కులకూ కావలికాస్తూ రక్షిస్తారనేది పురాణ కథనం. ఉపమందిరాలలో స్తంభంలోంచి ఉబికి వచ్చినట్లున్న స్తంభాంబికా, శివుడు, గణపతి, కుమారస్వామి, మహాకాళి దేవతలు దర్శనమిస్తుంటారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 130 కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

- బుర్రా అనూరాధ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని