శిష్యుడికి పరీక్ష

ఒకసారి వ్యాసమహర్షి చెబుతుంటే ఆయన శిష్యుడు జైమిని రాస్తున్నాడు. ‘బలవాన్‌ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి’ అంటూ చెప్పాడు వ్యాసుడు. ‘ఇంద్రియ సమూహం బలీయమైనది. పండితులను కూడా పెడతోవ పట్టిస్తుంది’

Updated : 28 Oct 2021 02:38 IST

కసారి వ్యాసమహర్షి చెబుతుంటే ఆయన శిష్యుడు జైమిని రాస్తున్నాడు. ‘బలవాన్‌ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి’ అంటూ చెప్పాడు వ్యాసుడు. ‘ఇంద్రియ సమూహం బలీయమైనది. పండితులను కూడా పెడతోవ పట్టిస్తుంది’ అనేది దాని భావం. కానీ జైమినికి అది సముచితంగా తోచలేదు. తమ లాంటి పండితులకు అది వర్తించదని, ఆత్మనిగ్రహం ఉంటుందని అతని నమ్మకం. అందువల్ల గురువుగారు చెప్పిన శ్లోకాన్ని కొంచెం మార్చి ‘బలవాన్‌ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి’ అని రాశాడు. దాని ప్రకారం ‘ఇంద్రియాలు ఎంత బలీయమైనా కూడా విద్వాంసుని పెడతోవ పట్టించలేవు’ అనే అర్థం వస్తుంది.

వ్యాసుడు శ్లోకాన్ని ఎందుకు మార్చావని అడగకుండా ఊరుకున్నాడు.

కొన్ని రోజులకు జైమిని తపస్సులో ఉండగా గాలివాన వచ్చింది. ఆ సమయంలో ఒక స్త్రీ జైమిని దగ్గరికొచ్చి తనను రక్షించమంది. జైమిని ఆమెని చూడగానే మోహించాడు. ‘నీ పట్ల నాకు ప్రేమ కలిగిందంటూ’ లేచి ఆమెవైపు అడుగులు వేశాడు. తీరా ఆమెను సమీపంగా చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చింది మరెవరో కాదు, వ్యాసమహర్షే. స్త్రీ రూపంలో వచ్చి శిష్యుని పరీక్షించాడు.

జైమిని సిగ్గుపడి గురువుగారిని క్షమించమని అడిగాడు. శ్లోకాన్ని తక్షణం మార్చి రాశాడు.

- రత్న


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని