గోదావరి తీరంలో అష్టలక్ష్మీ ఆలయం

ఆధ్యాత్మిక కేంద్రమైన గోదావరిని దక్షిణ కాశీగా ప్రసిద్ధం. అక్కడి ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి... శ్రీఅష్టలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం. దీన్ని రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో 2003లో నిర్మించారు.

Updated : 04 Nov 2021 06:40 IST

ధ్యాత్మిక కేంద్రమైన గోదావరిని దక్షిణ కాశీగా ప్రసిద్ధం. అక్కడి ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి... శ్రీఅష్టలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం. దీన్ని రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో 2003లో నిర్మించారు. ఆలయ ముందు భాగంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉండగా అంతరాలయంలో చుట్టూ అష్టలక్ష్ములు దర్శనమిస్తారు. అన్యోన్య దాంపత్యం కోసం లక్ష్మీ నారాయణులను, తక్షణ వివాహానికి, మోక్షం కోసం ఆదిలక్ష్మి అమ్మవారిని, సంపూర్ణ ఆరోగ్యానికి ధాన్యలక్ష్మిని, పిరికితనం పోవడానికి ధైర్యలక్ష్మిని, విశేషబలం కోసం గజలక్ష్మిని, ఉత్తమ సంతానం కోసం సంతానలక్ష్మిని, సకల సిద్ధులూ ప్రాప్తించాలని విజయలక్ష్మిని, విద్యాభివృద్ధుల కోసం ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి అమ్మవార్లను పూజిస్తారు.  

26 అడుగుల రంగనాథుడి సుధామూర్తి

అష్టలక్ష్ములతో కొలువైన లక్ష్మీనారాయణుల చెంత రంగనాథుడి విగ్రహాన్ని 2005లో ప్రతిష్ఠించారు. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన విగ్రహంతో శ్రీరంగనాథస్వామి తమ కోర్కెలు తీరుస్తారని భక్తుల నమ్మకం. శిల్పులు ఆలయంలోనే రూపొందించిన ఈ విగ్రహాన్ని సుధామూర్తిగా పిలుస్తారు. తమిళ నాడులో భూలోక వైకుంఠంగా కావేరీ నదీతీరంలో కొలువైన శ్రీరంగం క్షేత్రంలో రంగనాథస్వామి కొలువై ఉన్నాడు. అంతటి దివ్య క్షేత్రం గోదావరి తీరంలోనూ నిర్మించాలనే సంకల్పంతో శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి సూచనలతో ఎక్కడా లేని విధంగా లక్ష్మీనారాయణుడి సన్నిధిలో 26 అడుగుల రంగనాథస్వామి దివ్య సుందర మూర్తిని ప్రతిష్టించారు. ఈ ప్రాంగణంలో గోదాదేవి, గరుడాళ్వార్లు సైతం కొలువుదీరారు. వైష్ణవ సంప్రదాయంలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి నెలా రేవతి నక్షత్రం రోజున గోదా, రంగనాథస్వామి కల్యాణ వేడుక నిర్వహిస్తారు. ఏటా జూన్‌ నెలాఖరులో జేష్ఠ పౌర్ణమి రోజున వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసం నెలరోజులూ గోదాదేవి, రంగనాథులకు విశేష అర్చన, అలంకరణ, పూజలు నిర్వహిస్తారు.


-  వై.సూర్యకుమారి, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని