పూర్వ పుణ్యం

ఒక మహారాజు తన జాతక పత్రాన్ని చదువుతుంటే ఆయనకో అనుమానం వచ్చింది. ‘నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేకమంది పుట్టి ఉంటారు. కానీ వారెవరూ రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను?!’ అనుకున్నాడు. మరుసటి రోజు సభలో ఆ ప్రశ్నే అడిగాడు.

Updated : 04 Nov 2021 06:47 IST

క మహారాజు తన జాతక పత్రాన్ని చదువుతుంటే ఆయనకో అనుమానం వచ్చింది. ‘నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేకమంది పుట్టి ఉంటారు. కానీ వారెవరూ రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను?!’ అనుకున్నాడు. మరుసటి రోజు సభలో ఆ ప్రశ్నే అడిగాడు.

అపుడో వృద్ధ పండితుడు ‘రాజా! ఈ నగరానికి ఉత్తరాన ఉన్న అడవిలో ఓ సన్యాసి ఉన్నాడు. అతణ్ని కలిస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది’ అన్నాడు.

రాజు అక్కడికి వెళ్లేసరికి ఆ సన్యాసి గడ్డి తింటున్నాడు. విడ్డూరం అనిపించినా పట్టించుకోకుండా తన సందేహం బయటపెట్టాడు.

ఆయన ‘ఇక్కడికి నాలుగు కోసుల దూరంలో ఇలాంటిదే మరో గుడిసె ఉంది. అందులో ఉన్న సన్యాసిని కలవండి’ అన్నాడు.

తీరా ఆ సన్యాసి ఆకులు తింటున్నాడు. రాజుకు ఇబ్బందిగా అనిపించినా తన ప్రశ్నను అడిగాడు.

సన్యాసి ‘ఇదే దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది. అక్కడో వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, అతన్ని కలవండి’ అన్నాడు. రాజుకు అయోమయంగా అనిపించినా వెళ్లాడు. అతడు తల పంకించి ‘గత జన్మలో నలుగురు వ్యక్తులు అడవిలో ప్రయాణిస్తూ దారి తప్పారు. ఆకలేయగా తమ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు కింద ఆగారు. తినబోతుండగా, నీరసంగా ఉన్న పెద్దాయన వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగాడు. మొదటివాడు కోపంతో ‘ఇది నీకిచ్చి నేను గడ్డి తినాలా?’ అని కసురుకున్నాడు. రెండో వ్యక్తి వైపు చూడగా ‘ఈ రొట్టె నీకిస్తే నేను ఆకులు, అలాలూ తినాల్సిందే’ అన్నాడు. మూడోవాడు ‘రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా?’ అని తూలనాడాడు. నాలుగో వ్యక్తి మాత్రం ‘తాతా! చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టె నువ్వు తిను’ అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు. ఆ నాలుగో వ్యక్తివి నువ్వే. నీ ఆకలిని అణచుకుని వేరొకరిని సంతృప్తిపరచిన పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ జన్మ చరితార్థం చేసుకో. మరుజన్మలోనూ మంచి స్థితిని పొందు’ అని కన్ను మూశాడు.
చేసిన పాపపుణ్యాలను బట్టి జన్మలు ప్రాప్తిస్తాయంటూ తథాగతుడు చెప్పిన కథ ఇది.

- శారదాదిత్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని