అసలైన ప్రశాంతత

ఓ రాజుగారు ప్రశాంతతకు ప్రతీకగా నిలిచే అద్భుత చిత్రాన్ని గీయించి, తన మందిరంలో తగిలించుకోవాలనుకున్నాడు. అది తెలిసి ఎందరో చిత్రకారులు మహారాజును మెప్పించాలని ప్రయత్నించారు. మంత్రి ఎంతో ఆలోచించి రెండింటిని ఎంపిక చేశాడు.

Updated : 08 Dec 2021 16:39 IST

రాజుగారు ప్రశాంతతకు ప్రతీకగా నిలిచే అద్భుత చిత్రాన్ని గీయించి, తన మందిరంలో తగిలించుకోవాలనుకున్నాడు. అది తెలిసి ఎందరో చిత్రకారులు మహారాజును మెప్పించాలని ప్రయత్నించారు. మంత్రి ఎంతో ఆలోచించి రెండింటిని ఎంపిక చేశాడు. అందులో ఒకదాంట్లో దూదిపింజల్లాంటి మబ్బులు, సెలయేరు, పూలతేరుతో ప్రశాంతతకు ప్రతీకలా ఉంది. రాజుకీ అదే నచ్చుతుంది అనుకున్నారంతా. రెండో చిత్రంలో కొండలూ లోయలూ ఉధృత జలధారలు, కారుమబ్బులు, కుండపోత వర్షంతో ప్రళయం విలయతాండవం చేస్తున్నట్టుంది. ‘రాజుగారు అడిగింది ఉగ్రరూపం కాదు, ప్రశాంతత కదా’ అనుకున్న సభికులు చిత్రకారుడి వైపు జాలిగా చూశారు. కానీ ఆశ్చర్యంగా ఆ చిత్రమే రాజుగారి మనసును దోచుకుంది. సభాసదులు అందులో ప్రళయ దృశ్యాన్నే చూశారు. కానీ రాజు జలధారల హోరు పక్కన చిత్రకారుడు ఒద్దికగా గీసిన పక్షిగూటిని చూశాడు. ప్రకృతి బీభత్సం నడుమ కూడా పచ్చనిపొదలో వెచ్చని గూటిలో తల్లిపక్షి పిల్లగువ్వతో ఒదిగి ప్రశాంతంగా కూర్చుంది. ‘శాంతి అంటే ఏ అలజళ్లూ లేనప్పుడు ఉండే మానసిక స్థితి కాదు, నలువైపులా అల్లకల్లోలం అలముకున్నా నిశ్చలంగా నిలవడమే నిజమైన శాంతి’ అంటూ ఆ చిత్రానికే బహుమతి ప్రకటించాడు.

  - ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని