మనసుతో చదవాలి

పాండవులు చదువుకునేందుకు గురుకులంలో చేరారు. వారితో పాటు ఎందరో రాజకుమారులు ఆ ఆశ్రమంలో చేరారు. అక్కడ పోటీలు పెట్టి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చే ఆచారముంది. అందువల్ల

Updated : 18 Nov 2021 05:17 IST

పాండవులు చదువుకునేందుకు గురుకులంలో చేరారు. వారితో పాటు ఎందరో రాజకుమారులు ఆ ఆశ్రమంలో చేరారు. అక్కడ పోటీలు పెట్టి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చే ఆచారముంది. అందువల్ల అందరూ పోటీ పడేవారు. ఒకసారి గురువు కృపాచార్యులవారు దూర ప్రాంతానికి వెళ్లాల్సిరావడంతో చదవాల్సిన పాఠాలు శిష్యులకు పురమాయించి వెళ్లాడు.

కృపాచార్యుడు ఆశ్రమానికి తిరిగొచ్చాక తాను లేనప్పుడు శిష్యులేం చదివారో తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. శిష్యులు తాము చదివిన విషయాలను వివరిస్తున్నారు. ఒకరు మూడు, మరొకరు నాలుగు, ఇంకొకరు ఐదు పాఠాలు చదివామని చెప్పారు. ధర్మరాజు కృపాచార్యునికి నమస్కరించి ‘అయ్యా! ఇన్ని రోజుల్లో నేను ఒక వాక్యం మాత్రమే చదివాను’ అన్నాడు. కృపాచార్యుడు ఆశ్చర్యంగా ‘నీకంటే చిన్నవాళ్లు చాలా పాఠాలు చదివారు. నువ్విలా చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదూ?’ అన్నాడు. ధర్మరాజు ప్రశాంతంగా ‘ఏమో గురువర్యా! అంతే పూర్తి చేయగలిగాను’ అని వినయంగా జవాబిచ్చాడు. తెలివైనవాడు, ఆదర్శవంతుడు అనుకున్నవాడు అలా అనేసరికి పట్టరాని కోపం వచ్చింది. ధర్మరాజుని శిక్షించకుండా వదిలేస్తే తక్కిన శిష్యులు కూడా అలాగే చేస్తారనుకుని ‘నువ్వు సోమరితనంతో చదవకపోవడమే కాకుండా, మొండిగా జవాబిస్తున్నావు’ అంటూ అరిచారాయన. దాంతో ‘మీకు నిరాశ కలిగించినందుకు విచారిస్తున్నాను’ అన్నాడు ధర్మరాజు. మిగిలిన విద్యార్థులందరూ ధర్మరాజు వైఖరికి నవ్వసాగారు. కృపాచార్యుడు కోపాన్ని నిగ్రహించుకోలేక ‘ఇతణ్ని శిక్షించకపోతే మిగిలిన విద్యార్థులూ చెడిపోతారు’ అనుకుని ధర్మరాజును దండించాడు. దాంతో ధర్మరాజు ‘మీకు చాలా నిరాశ కలిగించాను. క్షమించండి’ అన్నాడు. శిష్యులంతా వింతగా చూశారు. గురువు ముందు విస్తుపోయి, ఆపైన ఆలోచనలో పడ్డాడు. ధర్మరాజు ఏదో కొత్త విషయాన్ని సాధించి ఉండకపోతే ఇంత ధీమాగా ఉండడు- అనుకుని ‘ఇంతకీ నువ్వు చదివిన వాక్యమేంటి?’ అన్నాదు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోవద్దు అనేది చదివాను’ అన్నాడు. అంతా ఆశ్చర్యపోయారు. కేవలం చదవడం కాకుండా చదివింది ఆచరణలో పెట్టిన ధర్మరాజు ఎంత గొప్పవాడో అర్థమైంది. ‘విషయమేంటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. క్షమించు. నోటితో కాకుండా మనసుతో చదివిన నీ పాండిత్యం గొప్పది’ అంటూ ధర్మజుని దగ్గరికి తీసుకున్నాడాయన.

- శారదాదిత్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని