రాముడు మాయలేడిని చంపిందిక్కడే...

స్థలపురాణాన్ని అనుసరించి రామాయణంలో బంగారులేడిని సంహరించిన ప్రాంతమే జనగామ జిల్లా లింగాలఘనపూర్‌ మండలం జీడికల్‌ గ్రామం. రాములవారు గోదావరి తీరంలోని భద్రాచలం వద్ద పర్ణశాలలో

Updated : 18 Nov 2021 05:18 IST

స్థలపురాణాన్ని అనుసరించి రామాయణంలో బంగారులేడిని సంహరించిన ప్రాంతమే జనగామ జిల్లా లింగాలఘనపూర్‌ మండలం జీడికల్‌ గ్రామం. రాములవారు గోదావరి తీరంలోని భద్రాచలం వద్ద పర్ణశాలలో ఉండగా సీతమ్మ కోరికపై బంగారులేడిని వెంటాడి బాణం సంధించాడు. ఇక్కడి నుంచే ‘హే లక్ష్మణా! ఆ.. సీతా’ అని మాయావి మరీచుడు అరవగా భర్తకేదో అయ్యిందని భయపడిన సీతమ్మ లక్ష్మణుని పంపింది. రావణుడు సీతను అపహరించాడు. భద్రాచలం రామప్రేమకు ప్రతీక కాగా, వీరాచలం పరాక్రమానికి సంకేతం. అందుకే ఎక్కడా లేనివిధంగా రాములవారికి ఇక్కడ మెలితిరిగిన మీసాలుంటాయి. వీరుడు అనే రుషి ఈ గుట్టపై తపస్సు చేసి శ్రీరాముని ప్రసన్నం చేసుకుని ఇక్కడ కొలువయ్యేలా వరం పొందాడంటారు. త్రేతాయుగం నుంచే ఇక్కడ లయముందని, భద్రాచలం కంటే పురాతనమైందని చెబుతారు.

గతంలో యాదాద్రి ఆలయానికి ఇక్కడి నుంచే ధూపదీప నైవేద్యాలు వెళ్లేవట. కోవెల పరిసరాల్లో పరుపుబండపైన నేటికీ రాములవారి పాదాలు, మోకాలి ముద్రలు, బాణం ఆనవాళ్లు, లేడి కాలి గుర్తులు, రక్తం మరకలు కనిపిస్తాయి. సీతాలక్ష్మణ సమేత రాముడు ఉత్తరముఖంగా దర్శనమివ్వగా, గుట్టకు నైరుతిలో ఆంజనేయస్వామి ఉంటాడు. గర్భాలయంలో మూలవిరాట్టు ముందు రామగుండం పేరుతో చిన్న నీటిగుంత ఉంది. వనవాసంలో దాహమేసి రాముడు బొటనవేలిని నేలలో గుచ్చగా నీళ్లు ఉబికివచ్చాయట. ఈ గుంతలో ఎప్పుడూ నీరుంటుంది. స్వామిపై గాలీ వెలుతురూ పడేలా, నీరు తాకేలా ఉంటుంది గుడి నిర్మాణం. ఆలయ ప్రాంగణంలో జీడిగుండం, పాలగుండం అనే గుంతలున్నాయి. మండు వేసవిలోనూ వాటిల్లో నీరు నిలకడగా ఉంటుంది. కార్తిక పౌర్ణమి నుంచి 45 రోజుల పాటు ఇక్కడ విశేషంగా జాతర నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏటా శ్రీరామనవమికి ఒకసారి, కార్తికమాసంలో మరోసారి సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఇక్కడి గుహలో వాల్మీకి తపస్సు చేశాడంటారు. రోడ్డు, రైలు మార్గాల్లో జనగాం చేరుకుని, అక్కడి నుంచి ఆటో, బస్సుల్లో గుడికి వెళ్లొచ్చు.

- బి.మహేష్‌కుమార్‌, జీడికల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని