సింధు స్మరణ వందన సమర్పణ

గంగ ఆధ్యాత్మిక వైభవానికి దర్పణమైతే సింధు సనాతన వారసత్వానికి, చారిత్రక ప్రాభవానికి ప్రతీక. వేదాలు సింధునదిని తొలి నదిగా వర్ణించాయి. పాష్తోభాషలో ఈ నదిని అబాసిన్‌ (నదులన్నిటికీ తండ్రి) అంటారు.

Updated : 25 Nov 2021 06:31 IST

డిసెంబర్‌ 2 సింధునది పుష్కరాల ముగింపు

గంగ ఆధ్యాత్మిక వైభవానికి దర్పణమైతే సింధు సనాతన వారసత్వానికి, చారిత్రక ప్రాభవానికి ప్రతీక. వేదాలు సింధునదిని తొలి నదిగా వర్ణించాయి. పాష్తోభాషలో ఈ నదిని అబాసిన్‌ (నదులన్నిటికీ తండ్రి) అంటారు. వేదాలు, ఉపనిషత్తులు ఈ నదితీరానే ఆవిర్భవించాయి. మనం నిత్యం స్మరించుకునే ఏడు నదుల్లో సింధు ఒకటి. బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించినపుడు ఈ నదికి పుష్కరాలు వస్తాయి. భారత్‌లో లద్దాఖ్‌, కాశ్మీర్‌ల నుంచి సింధూనది ప్రవహిస్తుంది. ఈ నది ప్రవహించే ప్రాంతాలు కొన్ని పాక్‌ ఆక్రమణలో ఉన్నందున మనవాళ్లు దర్శనం చేసుకోవడానికి మిగిలింది లద్దాఖ్‌ మాత్రమే.

కైలాసమానస సరోవరం దగ్గర సింగి ఖంభన్‌ అనే హిమానీనదం నుంచి సముద్రమట్టానికి 5182మీ ఎత్తున జన్మించిన ఈ నది సుమారు 3180కి.మీలు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌, లేహ్‌, నిమ్ము, బాటాలిక్‌ ద్వారా ప్రవహిస్తూ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.

నదులని స్త్రీ దేవతలంటారు. కానీ ఋగ్వేదంలో సింధుని పురుషనది అన్నారు. ఇది వృషభం వలె రంకెలు వేస్తూ పర్వతాల్లోంచి ఉధృతంగా ప్రవహిస్తూ ముందుకు దుముకుతుంటే మిగతా నదులు గోవుల్లా సింధుతో కలవడానికి ఉరకలేస్తున్నాయని ఋగ్వేదం 10వ మండలంలోని నదీ స్తుతిసూక్తలో వర్ణించారు. సింధు అంటే ఎదురులేని జలప్రవాహం, సముద్రం అనే అర్థాలున్నాయి. రామాయణ, భారతాల్లో దీనిని ఎంతగానో కీర్తించారు. అనేక మతాలవారు ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి సుక్కూర్‌ జలాశయం దగ్గర్లో బుక్కూర్‌ ద్వీపంలో సాత్‌ బేలో ఆలయం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. వరుణదేవుని అవతారమైన జూలేలాల్‌ మందిరాన్ని దర్శిస్తారు. ఇండియా అనే పేరు ఈ నది నుంచే వచ్చింది. హరప్పా నాగరికతకు ఈ ప్రాంతమే పుట్టినిల్లు. శివ, శక్తి ఆరాధన ఈ నదీతీరానే మొదలైందనేందుకు ఇక్కడ లభించిన పశుపతి, అమ్మతల్లి తదితర దేవతా విగ్రహాలే నిదర్శనం. ఇంత పవిత్ర నదిని మర్చిపోవటం భావ్యమా? పుష్కరాల సందర్భంగానైనా దూరం నుంచైనా సింధుని స్మరించి, వందనమర్పించి తరిద్దాం.

- గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని