మాటలో మనిషి ప్ర‘వృత్తి’

కంటిచూపు లేని ఓ సాధువు చెట్టు నీడన ధ్యానముద్రలో ఉన్నాడు. ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి, ‘ఏయ్‌ ముసలీ! ఈ మార్గంలో ఎవరైనా వెళ్లటం గమనించావా?’ అని గద్దించి అడిగాడు. ‘లేదయ్యా! ఎవరూ వెళ్లలేదు’ అన్నాడు సన్యాసి. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి

Updated : 23 Dec 2021 06:06 IST

కంటిచూపు లేని ఓ సాధువు చెట్టు నీడన ధ్యానముద్రలో ఉన్నాడు. ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి, ‘ఏయ్‌ ముసలీ! ఈ మార్గంలో ఎవరైనా వెళ్లటం గమనించావా?’ అని గద్దించి అడిగాడు. ‘లేదయ్యా! ఎవరూ వెళ్లలేదు’ అన్నాడు సన్యాసి. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి ‘అయ్యా! ఈ దోవలో ఎవరైనా వెళ్లారా!’ అనడిగాడు. సాధువు ‘కొద్దిసేపటి క్రితం ఎవరో ఇలాగే అడిగి వెళ్లారు’ అన్నాడు. మరికొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి ‘మునివర్యా! నమస్కారం! ఇంతకు మునుపు ఈ మార్గంలో ఎవరైనా వెళ్లిన శబ్దం విన్నారా?’ అని వినమ్రంగా అడిగాడు. ‘నమస్కారం మహారాజా! మొదట సేనానాయకుడు, తర్వాత మంత్రి వెళ్లారు. వాళ్లూ ఇలాగే అడిగారు’ అన్నాడు. మహారాజు ఆశ్చర్యంగా ‘మునివర్యా! మరోలా భావించకండి! మీకు చూపులేదు కదా! నేను మహారాజుననీ, ఈ మార్గంలో మొదట వెళ్లింది సేనానాయకుడనీ, తర్వాత మంత్రి అనీ ఎలా చెప్పగలిగారు?’ అనడిగాడు. ‘మహారాజా! ఇది తెలుసుకోవటానికి చూపు అవసరం లేదు. మాటతీరును బట్టి, వారెలాంటివారో, ఎంత హోదాలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మొదటి వ్యక్తి కనీస మర్యాద లేకుండా ప్రశ్నించాడు. తర్వాతి వ్యక్తి మాటల్లో అధికార దర్పం కనబడింది. ఇక మీరు గౌరవంగా, ఆదరంగా మాట్లాడారు. మాటతీరును బట్టే ఎవరు ఏ హోదాలో ఉన్నారో గుర్తించాను’ అన్నాడు. అందుకే కవి బసవేశ్వరుడు ‘పలికిన ముత్యపు సరంబుగ నుండవలె.. పలికిన మాణిక్యపు దీప్తిక నుండ వలె.. పలికిన స్ఫటికపు పూసలాగ నుండవలె’ అన్నాడు.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని