బలిచక్రవర్తిని అణిచేసిందిక్కడే...

పవిత్ర కృష్ణానదీ తీరంలో ప్రకృతి రమణీయతల నడుమ శివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం గుంటూరు జిల్లాలోని సత్రశాల. ఇక్కడ రుషులు సత్రయాగం చేసినందున సత్రశాల అనే పేరొచ్చిందనేది స్థల పురాణం. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా యాగరక్షణార్థం రామలక్ష్మణులు వచ్చి, రాక్షసులను తరిమి, బాణాలతో

Updated : 30 Dec 2021 06:05 IST

పవిత్ర కృష్ణానదీ తీరంలో ప్రకృతి రమణీయతల నడుమ శివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం గుంటూరు జిల్లాలోని సత్రశాల. ఇక్కడ రుషులు సత్రయాగం చేసినందున సత్రశాల అనే పేరొచ్చిందనేది స్థల పురాణం. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా యాగరక్షణార్థం రామలక్ష్మణులు వచ్చి, రాక్షసులను తరిమి, బాణాలతో ఛత్రాన్ని(గొడుగు) నిర్మించినందున ఛత్రశాలై కాలక్రమంలో సత్రశాలగా స్థిరపడిందని మరో గాథ ప్రచారంలో ఉంది. శ్రీమహావిష్ణువు వామనరూపం దాల్చి బలిచక్రవర్తిని ఇక్కడే అణిచివేశాడట. రాక్షసులు కాకులుగా మారి యజ్ఞగుండాల్లో మాంసపు ముక్కలు వేస్తుండడంతో ఆగ్రహించిన విశ్వామిత్రుడు ఆలయ పరిసరాల్లో కాకులు వాలకుండా శపించాడని, అందుకే ఈ ప్రాంతంలో కాకులు వాలవంటారు. పదమూడో శతాబ్దంలో కాకతీయ సామంతరాజు అంబదేవుడు ఆలయాన్ని పునరుద్ధరించి ధూపదీప నైవేద్యాల కోసం మాన్యం ఇచ్చాడు. ఇక్కడి శివలింగాన్ని విశ్వామిత్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడు. ఆలయ ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వరుడు, చీకటి మల్లయ్య, సంతానమల్లికార్జునుడు, ఆంజనేయుడు, కాలభైరవుడు, కుమారస్వామి, కాశీవిశ్వేశ్వరులకు మందిరాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా సిద్ధపురుషులతో నిండి ఉండేదట. అందుకే దీన్ని సిద్ధవనం అని కూడా పిలుస్తారు. రెంటచింతల నుంచి రోడ్డు మార్గంలో ఈ గుడికి చేరుకోవచ్చు.

- ఎ.ఎం.నాగప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని