సింహాచలం మకరవేట

శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలైన వరాహ, నారసింహ కలిసి ద్వయావతార రూపుడుగా వరాహ నరసింహస్వామిగా వెలసిన క్షేత్రం సింహాచలం. సుందర ప్రకృతి దృశ్యాల నడుమ ఉన్న ఈ ఆలయం ఎంత ప్రాచీనమైందో

Updated : 13 Jan 2022 06:09 IST

శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలైన వరాహ, నారసింహ కలిసి ద్వయావతార రూపుడుగా వరాహ నరసింహస్వామిగా వెలసిన క్షేత్రం సింహాచలం. సుందర ప్రకృతి దృశ్యాల నడుమ ఉన్న ఈ ఆలయం ఎంత ప్రాచీనమైందో అంత ప్రసిద్ధమైంది. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా వైభవాన్ని సంతరించుకుంది. రామానుజులు, కృష్ణమాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి మహాపురుషులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని అర్చించారు. కులోత్తుంగ చోళుడు, కృష్ణదేవరాయలు తదితరులు ఈ క్షేత్రాన్ని దర్శించి కానుకలు సమర్పించారు. ఉత్తర దక్షిణ శిల్పకళా రీతులకు ఆలవాలమైన నిర్మాణం వాద్య సంగీత నాట్యకళల కేంద్రంగా విలసిల్లినట్లు శాసనాల వల్ల తెలుస్తోంది. ఆలయం పశ్చిమాభిముఖంగా నిర్మితమైంది. మూలవిరాట్టుకు సంబంధించి ప్రాచీన గాథలనేకం ఉన్నాయి. సంస్కృతాంధ్ర భాషల్లో విశిష్ట సాహిత్యం ఈ క్షేత్ర పరంగా వెలసింది.

చైత్రం నుంచి ఫాల్గుణం వరకు సింహాచల క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. భోగినాడు గోదా కల్యాణం జరుగుతుంది. సంక్రాంతినాడు ఆలయ స్తంభాలకు అన్నంతో బలి వేస్తారు. ఇక్కడి స్తంభాలన్నీ స్వామివారికి బాహువులని, ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల మకర సంక్రాంతి నాడు వాటికి బలిహరణ జరుపుతారు.
కనుమ నాడు స్వామివారి ఉత్సవ మూర్తి కొండమీది నుంచి కిందనున్న గ్రామానికి విచ్చేస్తారు. ముందుగా స్వామి తన సోదరి, సింహాచలం (అడవివరం) గ్రామదేవత శ్రీపైడితల్లి అమ్మవారిని దర్శించి పూలతోటలోకి వచ్చి ‘మకరవేట’ జరుపుతారు. అదే గజేంద్రమోక్షం. మొసలి ఏనుగును పట్టుకోవడం, ఏనుగు చిరకాల పోరాటం, మొసలి పట్టు విడిపించుకోలేక చివరకు ఏనుగు విష్ణువును ప్రార్థించడం, స్వామివారు దిగివచ్చి చక్రప్రయోగంతో మకరాన్ని సంహరించి ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించడం- భాగవతంలోని ప్రసిద్ధ వృత్తాంతం. జలాశయంలో బొమ్మ మొసలిని, ఏనుగును పెట్టి మకరిని సంహరించినట్లు చూపిస్తారు. ఈ ఉత్సవం అయ్యాక స్వామిని గజవాహనం మీద ఊరేగిస్తారు.

- డి.భారతీదేవి


మనం దుర్మార్గులం అనుకోవటం సరి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ సజ్జనులే! లేనిపోని వాంఛలతోనే చిక్కు. వాటిని మార్చుకోవాలంతే!

- రమణ మహర్షి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని