బిలంలో కొలువైన పరమశివుడు

గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుండగా కొండ గుహలో స్వయంభుగా వెలసి పూజలందుకుంటున్నాడు. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశాడంటారు.

Updated : 27 Jan 2022 05:06 IST

గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుండగా కొండ గుహలో స్వయంభుగా వెలసి పూజలందుకుంటున్నాడు. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశాడంటారు. స్థలపురాణం ప్రకారం వందేళ్ల క్రితం బిలం సమీపంలో పశువుల కాపరులకు ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్ర జపం వినిపించింది. వారంతా చుట్టూ వెతగ్గా బండరాళ్ల మాటున ఓ సొరంగం కనిపించింది. అతి కష్టం మీద తాళ్ల సాయంతో అందులోకి వెళ్లిన వాళ్లకు కొంత దూరంలో శివలింగం.. పూజ చేస్తున్న రుషులు కనిపించారు. వారిని సమీపించే ధైర్యం లేక మరికొందరిని వెంటబెట్టుకొని మళ్లీ బిలంలోకి వెళ్లగా రుషులు కనిపించలేదు. కానీ శివలింగానికి పూజ చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నాటి నుంచి ఆ స్వామిని భక్తులు అమరలింగేశ్వరుడిగా పూజిస్తున్నారు. ఈ బిలం లోపల అనేక సొరంగ మార్గాలు కనిపిస్తాయి. వీటి ద్వారా మునులు గుత్తికొండ బిలం, ఎత్తిపోతల, త్రిపురాంతకం, శ్రీశైలం తదితర క్షేత్రాలకు వెళ్లేవారట. బిలంలోకి వెళ్లే మార్గం ఇరుకుగా ఉంటుంది. లోనికి వెళ్లడానికి, తిరిగి బయటకు రావడానికి వేరు వేరు దారులు ఉంటాయి. వృద్ధులు, మహిళలకు లోనికి వెళ్లడం కొంత కష్టంగా ఉంటుంది. స్వామి సన్నిధిలో నిద్రచేస్తే రోగాలు నయమవుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కార్తికమాసం, శివరాత్రి పర్వదినాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దైద బిలానికి వెళ్లడానికి బస్సు, ఆటో సౌకర్యం ఉంది.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు