భక్తుని చేతిలో ఓడిన కృష్ణుడు

ధర్మజుని అశ్వమేధయాగంలో మయూరధ్వజుడనే రాజు వీరధర్మం పాటిస్తూ యాగాశ్వాన్ని పట్టు కున్నాడు. అతడు మహాపరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వాన్ని విడిపించేందుకు యుద్ధానికి వచ్చారు కృష్ణార్జునులు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించాడు

Updated : 10 Mar 2022 04:58 IST

ధర్మజుని అశ్వమేధయాగంలో మయూరధ్వజుడనే రాజు వీరధర్మం పాటిస్తూ యాగాశ్వాన్ని పట్టు కున్నాడు. అతడు మహాపరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వాన్ని విడిపించేందుకు యుద్ధానికి వచ్చారు కృష్ణార్జునులు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించాడు మయూరధ్వజుడు. ప్రతిసారీ బాణం వేసేముందు శ్రీకృష్ణ నామస్మరణ చేశాడు. ‘నీ గాండీవం కానీ నా సుదర్శనచక్రం కానీ ఈ పరమ భక్తుని మీద పని చేయవు ఫల్గుణా!’ అన్నాడు కృష్ణుడు. ఇక ఇద్దరూ అక్కణ్ణించి వెళ్లిపోయారు.
మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషంలో మయూరధ్వజుని మందిరానికి భోజనానికి వెళ్లారు. ఆతిథ్యం స్వీకరించే ముందు శ్రీకృష్ణుడు ‘రాజా! నీ ఇంట తినడానికి మాకొక చిక్కు వచ్చింది. మేం అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా పుత్రుణ్ణి ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత ‘మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు’ అంటూ అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష పెట్టమని అర్థిస్తున్నాను’ అన్నాడు. అది విన్న మయూరధ్వజుడు ‘ఆహా! ఇప్పుడు కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. నా శరీరంలో అర్ధభాగాన్ని నిస్సందేహంగా తీసుకుని పులికి సమర్పించండి స్వామీ’ అన్నాడు. అతడి త్యాగనిరతికి ఆశ్చర్యపోయి చూస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటి నుంచి నీళ్లు కారసాగాయి. ‘రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది’ అన్నాడు కృష్ణుడు. ‘స్వామీ! మనస్ఫూర్తిగానే శరీరాన్ని సమర్పించాను. ఒక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతోందని ఎడమభాగం తనకా అదృష్టం లేదేమని విచారిస్తూ విలపిస్తోంది’ అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు తన అసలు రూపం చూపగా, మయూరధ్వజుడు వారికి నమస్కరించి యాగాశ్వాన్ని సమర్పించాడు.

- డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని