ఎవరి స్వభావం వారిదే!

ఓ గురువు గారు శిష్యులతో ఏరు దగ్గరికి వచ్చారు. వాళ్లు అవతలి గట్టుకి వెళ్లాలి. ఏరు పెద్దగా లోతు లేదు కానీ వెడల్పుగా ఉంది. నెమ్మదిగా నీళ్లలో నడుస్తుండగా ఒక తేలు నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది.

Updated : 17 Mar 2022 06:23 IST

ఓ గురువు గారు శిష్యులతో ఏరు దగ్గరికి వచ్చారు. వాళ్లు అవతలి గట్టుకి వెళ్లాలి. ఏరు పెద్దగా లోతు లేదు కానీ వెడల్పుగా ఉంది. నెమ్మదిగా నీళ్లలో నడుస్తుండగా ఒక తేలు నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది. గురువు దాన్ని నీటి మీద తేలుతున్న ఆకుపైన పెట్టారు. ఈలోపే అది చేతిమీద కుట్టింది. నీటితో కడుక్కున్నారు. తేలు మళ్లీ నీళ్లలో పడిపోయింది. గురువుగారు ఇంకో ఆకు మీద దాన్ని జాగ్రత్తగా పెట్టారు. అది మళ్లీ తన కొండేన్ని విసిరింది. గురువుగారి చేయి మండింది. కుట్టిన చోట నోటితో ఊదుకున్నారు. ముచ్చటగా మూడోసారి కూడా అదే వ్యవహారం. శిష్యులకి ఆశ్చర్యం వేసింది. ‘ఒకసారి కుడితే రెండోసారి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోయేది. మళ్లీమళ్లీ దాన్ని పట్టుకుని కుట్టించుకోవటం తెలివితక్కువతనం. గురువుగారు ఆ మాత్రం ఆలోచించలేక పోయారు’ అనుకుని బాధ పడుతున్నారు. ఒక తొందరపాటు శిష్యుడు అడిగేశాడు కూడా. గురువు మరోసారి తేలుతో కుట్టించుకుని దాన్ని గట్టు మీద పడేసి ‘తన దగ్గిరికి వచ్చినవాటిని కొండెంతో పరామర్శించటం తేలుస్వభావం. అది మనకి నొప్పిగానే ఉండొచ్చు.. దాని నైజాన్ని బట్టి ప్రవర్తించింది. ఆపదలో ఉన్న జీవులకి సహాయం చేయటం మనిషిగా నా తత్వం. విషకీటకమే తన స్వభావాన్ని బట్టి ప్రవర్తించినప్పుడు మనిషిగా నా తత్వానికి తగినట్టు ఉండొద్దా?!’ అన్నారు. ఇబ్బందులు కలిగినంత మాత్రాన స్వభావం మారదు కదా! ఇతరులకు మేలు చేయటం కంటే ఆనందం ఇంకేముంటుంది?!

- రాహుల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని