ఈ గుడికి వెళ్లడం సాహసయాత్రే!

బౌద్ధమందిరంలో నరసింహస్వామి దర్శనమివ్వడం ఆశ్చర్యమే కదూ! ములుగు జిల్లా జంగాలపల్లి మీదుగా వెళ్తుంటే.. కొత్తూరు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దేవునిగుట్టపై ఉందీ ఆలయం. ఇది

Updated : 17 Mar 2022 05:24 IST

బౌద్ధమందిరంలో నరసింహస్వామి దర్శనమివ్వడం ఆశ్చర్యమే కదూ! ములుగు జిల్లా జంగాలపల్లి మీదుగా వెళ్తుంటే.. కొత్తూరు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దేవునిగుట్టపై ఉందీ ఆలయం. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిది. కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ శైలిని పోలి ఉంటుంది. ఒక రాయిలో తల భాగం, మరో రాయిలో దేహం, ఇంకో రాయిలో కాళ్లు, మరో రాయిలో చేతులు చెక్కి శిల్పంగా కూర్చితే.. అది కాస్తా చౌర్యానికి గురైంది. కొందరు బుద్ధుణ్నీ శివుడిగా ఆరాధించడం తెలిసిందే! కనుక శివుడి విగ్రహం నెలకొల్పారు. కానీ కొన్నాళ్లకు ఆ విగ్రహం కూడా మాయమవడంతో కొత్తూరు గ్రామస్థులు 2012లో లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి వెళ్లేందుకు ఇప్పటికీ సరైన మార్గం లేదు. కానీ చిత్రమేమిటంటే.. కొండమీదుగా ప్రవహించే సెలయేరు దారి చూపుతుంది. దాని పక్కనుంచి వెళ్తే ఆలయానికి చేరుకోవచ్చు. అటవీ ప్రాంతంలో కొండ మీదున్న ఈ ఆలయం 60 శాతం శిథిలావస్థకు చేరుకుంది. హోలి పౌర్ణమి రోజున గుడిలో లక్ష్మీనరసింహ స్వామిని ప్రతిష్ఠించడంతో.. ఆ రోజున జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణ రోజుల్లో మనుషులే కానరాని దట్టమైన అడవిలో రాళ్లపై నడుచుకుంటూ ఈ ఆలయానికి వెళ్లడం సాహసయాత్రే అవుతుంది. ప్రాచీన వైభవాన్ని చాటే కుడ్య శిల్పాలు క్రమం తప్పి దర్శనమిస్తున్నాయి.

- భూపతి సత్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని