సముద్రంతో పోరాడిన పక్షులు

మహాభారతంలో ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకప్పుడు సముద్రతీరంలో తిత్తిరి పక్షుల జంట సంతోషంగా ఉండేది. కొంతకాలానికి ఆడపక్షి గుడ్లు పెట్టింది. మేతకి వెళ్లి తిరిగొచ్చేసరికి అవి సముద్రంలో కలిసిపోయాయి. పిట్టలు ఎంతో బాధపడ్డాయి.

Updated : 31 Mar 2022 05:04 IST

హాభారతంలో ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకప్పుడు సముద్రతీరంలో తిత్తిరి పక్షుల జంట సంతోషంగా ఉండేది. కొంతకాలానికి ఆడపక్షి గుడ్లు పెట్టింది. మేతకి వెళ్లి తిరిగొచ్చేసరికి అవి సముద్రంలో కలిసిపోయాయి. పిట్టలు ఎంతో బాధపడ్డాయి. మర్నాడు మళ్లీ గుడ్లు పెట్టి మేతకి వెళ్లి వచ్చేసరికి అదే పరిస్థితి. మూడోనాడు కూడా అంతే. తల్లి పక్షికి దుఃఖం, కోపం పెనవేసుకుని వచ్చాయి. గుడ్లని తిరిగివ్వమని సముద్రుణ్ణి దీనంగా ప్రార్థించింది. సమాధానం రాలేదు. ఎట్లాగయినా తన గుడ్లను సముద్రంలోంచి తెచ్చుకోవాలని పంతం పట్టింది. రెండు పక్షులూ సముద్రంలో మునిగి, నోటి నిండా నీరు నింపుకుని, ఒడ్డుకు వచ్చి ఆ నీటిని ఉమ్మి, రెక్కలని విదిలించ సాగాయి. అట్లా సముద్రంలో ఉన్న నీరంతా ఎండగట్టాలని వాటి ఉద్దేశం. సముద్రపు నీరెంత? ఈ చిన్ని పిట్టల నోళ్లలో నిండే, రెక్కలు ముంచి తడిపితే వచ్చే నీరెంత? చూసిన వారంతా వాటి తెలివితక్కువతనానికి నవ్వసాగారు. పక్షులు పట్టించుకోలేదు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న గరుత్మంతుడు వాటిని చూసి ఎందుకలా చేస్తున్నారని అడిగితే అవి చెప్పాయి. ‘మీరింత చిన్నగా ఉన్నారు. సముద్రం అంత పెద్దగా ఉంది. దాన్ని ఎండగట్టటం సాధ్యమా?’ అన్నాడు. ‘మేం త్రికరణశుద్ధిగా మా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత దైవానుగ్రహం’ అని సమాధానం చెప్పాయి.

వాటి పట్టుదల చూసిన గరుత్మంతుడు సహాయం చేయదలచాడు. సముద్రుడికి పక్షి గుడ్లు తిరిగివ్వమని చెప్పాడు. మాట వినకపోతే తన రెక్కలతో నీళ్లను చెదరగొట్టబోయాడు. భయపడిన సముద్రుడు పక్షి గుడ్లను తెచ్చిచ్చాడు. ఆ చోటు వదిలి సముద్రానికి దూరంగా గూడుకట్టుకోమని పక్షులతో చెప్పాడు. అవి దూరంగా గూడు కట్టుకుని సుఖంగా ఉన్నాయి. సామర్థ్యం తగినంత లేకున్నా శాయశక్తులా కృషి చేస్తే ఏదో ఒక రూపంలో భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుందనడానికి ఈ కథే ఉదాహరణ.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని