చేజర్లలో చిత్రమైన శివలింగం

చేజర్లలోని కపోతేశ్వర ఆలయంలో శివలింగం చెక్కినట్లుగా గుంతలుగా ఉంటుంది. శిబి చక్రవర్తి పావురం కోసం తన మాంసాన్ని తీసివ్వగా ఇలా గుంతలు ఏర్పడ్డాయంటారు. లింగం పైనున్న రెండు రంధ్రాలు శిబి భుజాలంటారు. కుడి వైపు రంధ్రంలో కొన్ని నీళ్లే పడతాయి. రెండోదాంట్లో ఎన్ని నీళ్లు పోసినా ఇంకిపోతాయి...

Updated : 28 Apr 2022 04:45 IST

చేజర్లలోని కపోతేశ్వర ఆలయంలో శివలింగం చెక్కినట్లుగా గుంతలుగా ఉంటుంది. శిబి చక్రవర్తి పావురం కోసం తన మాంసాన్ని తీసివ్వగా ఇలా గుంతలు ఏర్పడ్డాయంటారు. లింగం పైనున్న రెండు రంధ్రాలు శిబి భుజాలంటారు. కుడి వైపు రంధ్రంలో కొన్ని నీళ్లే పడతాయి. రెండోదాంట్లో ఎన్ని నీళ్లు పోసినా ఇంకిపోతాయి.

స్థల పురాణాన్ని అనుసరించి శిబి సోదరుడు మేఘదాంబరుడు, ఒకరోజు శిబి అనుమతితో పెద్ద పరివారంతో తీర్థయాత్రలకు వెళ్లాడు. తర్వాత కొందరు యోగులతో కలిసి తపోదీక్ష చేసి అక్కడే శరీరాన్ని విడిచాడు. అతని శరీరాన్ని దహించగా ఆ భస్మం లింగరూపం ధరించింది. కొన్నాళ్లకు శిబి రెండో సోదరుడు మేఘుని వెతుకుతూ వచ్చి, అతడు చనిపోయినట్లు తెలుసుకున్నాడు. తాను కూడా తపస్సు చేసి మరణించాడు. తమ్ముళ్లను వెతుకుతూ వచ్చిన శిబి రెండు లింగాలను చూశాడు. ఆ స్థలంలో వంద యజ్ఞాలు చేయాలనుకున్నాడు. వందో యాగం చేస్తుండగా దేవతలు శిబిని పరీక్షించాలనుకున్నారు.

శివుడు వేటగాడిలా, బ్రహ్మ అతని బాణంగా, విష్ణువు పావురంలా యాగం జరిగే చోటుకు వచ్చారు. వేటగాడి దెబ్బకు గాయపడిన పావురం శిబి చక్రవర్తిని కాపాడమని కోరింది. శిబి అభయమిచ్చాడు. వేటగాడు పావురాన్ని గనుక ఇవ్వకుంటే తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందన్నాడు. శిబి పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగాణ్ణి ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండోవైపు ఉంచాడు. ఎంత మాంసం తీసి త్రాసులో పెట్టినా తులతూగడం లేదు. చివరికి తన తల నరికి ఆ త్రాసులో పెట్టాడు. ఆ త్యాగానికి మెచ్చిన దేవతలు వరం కోరుకోమన్నారు. శిబి తనకూ, తన పరివారానికీ కైలాస ప్రాప్తిని కోరి, తామందరి శరీరాలు లింగాలుగా మారాలన్నాడు. తల లేని చిహ్నంగా లింగాకృతి పైన చెక్కినట్లు ఉంటుంది. కపోతం వల్ల శిబికి మోక్షం ప్రాప్తించినందున కపోతేశ్వర లింగం అయ్యింది. శాసనాలను అనుసరించి కపోతేశ్వరుని చుట్టూ 4,444 లింగాలున్నాయి.

గుంటూరు నుంచి చేజర్లకు బస్సు సౌకర్యం ఉంది. లేదంటే నరసరావుపేట నుంచి ఆటోలో వెళ్లొచ్చు.

- జూపూడి శ్రీలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని