గానంతో జ్ఞానబోధ

అన్నమయ్యకీ బుద్ధుడికీ విరుద్ధ సారూప్యం ఉంది. పుట్టింది ఇద్దరూ వైశాఖ పౌర్ణమి రోజే. ఒకరు ధ్యానంతో, మరొకరు గానంతో జ్ఞానభిక్ష పెట్టారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఆధ్యాత్మిక తత్వంతోబాటు

Updated : 12 May 2022 06:08 IST

మే 16 అన్నమయ్య జయంతి

అన్నమయ్యకీ బుద్ధుడికీ విరుద్ధ సారూప్యం ఉంది. పుట్టింది ఇద్దరూ వైశాఖ పౌర్ణమి రోజే. ఒకరు ధ్యానంతో, మరొకరు గానంతో జ్ఞానభిక్ష పెట్టారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఆధ్యాత్మిక తత్వంతోబాటు హితబోధలూ చేసిన కవి అన్నమయ్య. ‘ఎండ గాని నీడ గాని ఏమైనా కానీ కొండలరాయుడే మా కుల దైవం’ కీర్తనలో సుఖ-దుఃఖాలు, కీర్తి-అవమానాలు, ధన-దారిద్య్రాలు, జ్ఞాన-అజ్ఞానాలకు ఎండనీడలను ప్రతీకగా చెప్పి వాటికి అతీతంగా వ్యవహరించమన్నారు. 

‘అధిక కులజుడైన హీన కులజుడైన నిక్క మెరిగిన మహా నిత్యుడు ఘనుడు’ కీర్తనలో కులం కన్నా గుణమే ప్రధానం, అదే నిత్యం సత్యం.. దాని రూపమే దైవం అన్నారు. సంకల్పం బలంగా ఉంటే దేవుడే దిగి వచ్చి పని పూర్తి చేస్తాడన్నారు ఇంకో సందర్భంలో. యాచన వద్దు, శ్రమించి బతకమన్నారు. ‘తందనాన అహి తందనాన పురే’ కీర్తనలో జాతి మత వివక్షలు మనం ఏర్పరచుకున్న గోడలని, అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరిలో హరిని చూడాలనే సర్వ సమానత్వం చాటారు. ‘వెర్రులారా మీకు వేడుక కలిగితేను’ కీర్తనలో సోమరితనాన్ని ఉపేక్షించమనడం కనిపిస్తుంది. ఖాళీగా, సోమరిగా ఉండే కంటే తడికలు అల్లమంటూ ఉద్బోధించారాయన. ‘ఇట్టి నా వెర్రితనములేమని చెప్పుకుందు, చదివితి దొల్లి కొంత చదివెనింకొంత ఎదిరి నన్నెరుగను’ అంటూ ఆత్మ పరిశీలన ముఖ్యమని, మన గురించి మనం తెలుసుకోలేని చదువు వ్యర్థమని సందేశమిచ్చారు. 

- పద్మజ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని