కోరినవన్నీ నెరవేర్చే గాజులమ్మ

దక్షిణ భారతదేశంలో అరుదైన రెండు గోదా దేవి ఆలయాల్లో ఒకటి ఏదులాబాద్‌లో ఉంది. గాజులమ్మగా పిల్చుకునే ఈ అమ్మవారు రంగారెడ్డి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో కొలువైంది. ఈ దేవతకు మట్టిగాజులు సమర్పిస్తే చాలు కోరినవన్నీ నెరవేరుతాయని, పెళ్లి కానివారికి పెళ్లవుతుంది, పెళ్లైనా ఆలుమగల

Updated : 02 Jun 2022 05:45 IST

క్షిణ భారతదేశంలో అరుదైన రెండు గోదా దేవి ఆలయాల్లో ఒకటి ఏదులాబాద్‌లో ఉంది. గాజులమ్మగా పిల్చుకునే ఈ అమ్మవారు రంగారెడ్డి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో కొలువైంది. ఈ దేవతకు మట్టిగాజులు సమర్పిస్తే చాలు కోరినవన్నీ నెరవేరుతాయని, పెళ్లి కానివారికి పెళ్లవుతుంది, పెళ్లైనా ఆలుమగల మధ్య సఖ్యత లోపిస్తే అమ్మవారి దర్శనంతో సమస్యలు సమసిపోతాయని భక్తుల నమ్మకం.

పురాణ కథనాన్ని అనుసరించి విష్ణుజిత్తుడు అనే పెరియాళ్వార్‌కు తులసీవనంలో దైవ దత్తంగా లభించిన గోదాదేవి ఆండాళ్‌గా పెరిగి పెద్దదవుతుంది. విష్ణుజిత్తుడు ఒకరోజు తన కుమార్తె రంగనాథుడికి వేసిన పూలమాలను తీసి, తాను వేసుకోవడం గమనించి కలత చెందాడు. ఆ రాత్రి రంగనాయకస్వామి అతని కలలో కనిపించి ఆమె అలివేలు మంగమ్మ అవతారమని వివరించి, తన వద్దకు చేర్చమని చెప్పాడు.

కులీకుతుబ్‌షా కాలంలో నిర్మించిన  గోదా సమేత రంగమన్నార్‌ ఆలయమిది. అప్పల దేశీకుల వంశస్థులు దేశాటన చేస్తూ ఇక్కడికొచ్చారు. అలా వచ్చిన శ్రీనివాస దేశీకుడు కాలం చేయడంతో ఆయన భార్య అలివేలు, బాలుడైన అప్పలాచార్యుడు రాయపురంలో ఉండిపోయారు. ఒకసారి తమిళనాడు విలియపుత్తురులోని గోదాదేవి ఆలయానికి వెళ్లగా, అమ్మవారు తనను ఏదులాబాద్‌ తీసుకెళ్లమని కోరిందట. అలా ఇక్కడ ఆలయం కట్టించారు.

ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం గోదాదేవి బాలిక రూపంలో గాజుల వ్యాపారితో మట్టిగాజులు వేయించుకుంది. అతడు డబ్బులడగ్గా తన తండ్రిని అడగమంది. గాజులతను అప్పలాచార్యుణ్ణి కలిసి గాజులకు డబ్బు చెల్లించమంటే, తమకసలు సంతానమే లేదన్నాడాయన. తీరా ఆలయంలో అమ్మవారి చేతికి గాజులున్నాయి. అలా అమ్మవారు గాజులమ్మగా పూజలందుకుంటోంది. ఇప్పటికీ ప్రతి నాగపంచమికీ గాజుల వ్యాపారి వంశస్థులు అమ్మవారికి గాజులు సమర్పించడం ఆనవాయితీ. ఆ రోజును పండుగగా జరుపుతారు. ఇక్కడ జరిగే గోదాకల్యాణాన్ని చూసేందుకు దేశవిదేశాల్లో స్థిరపడిన ఈ గ్రామస్థులూ తరలివస్తారు.  

  - తోనంగి శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని