రాత మార్చిన రామనామం

ఆ బాలుడు మందమతిగా ఉండేవాడు. చదువు అబ్బలేదు. చదివింది గుర్తుండేది కాదు. కుమారుడికి చదువు యోగం లేదేమోనని తల్లిదండ్రులు మథనపడేవారు. ఇంతలో ఆ అబ్బాయికి బాబాయి వరసయ్యే వారి దూరపు బంధువు ఒకరు వాళ్లింటికి వచ్చాడు.

Published : 09 Jun 2022 01:04 IST

ప్రబోధ

బాలుడు మందమతిగా ఉండేవాడు. చదువు అబ్బలేదు. చదివింది గుర్తుండేది కాదు. కుమారుడికి చదువు యోగం లేదేమోనని తల్లిదండ్రులు మథనపడేవారు. ఇంతలో ఆ అబ్బాయికి బాబాయి వరసయ్యే వారి దూరపు బంధువు ఒకరు వాళ్లింటికి వచ్చాడు. తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొడుకుకు సరస్వతీ కటాక్షం కలిగేదెప్పుడోనని బాధపడ్డారు. అది చూసి బాధపడిన బంధువు బాలుణ్ణి తానుండే రాయవేలూరుకు తీసుకువెళ్లాడు. వారి ఇలవేల్పు శోళింగపురం యోగనరసింహస్వామి. ఆయన ఆ స్వామిలో శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ నిరంతరం రామమంత్రాన్ని జపించేవారు. రామమంత్రంపై ఆయనకు అంత గురి. అందుకే ఓ శుభ సమయాన తన అన్న కుమారుడికి కూడా ‘రామతారక మంత్రం’ ఉపదేశించాడు. ప్రతి నిత్యం ఆ మంత్రాన్ని జపించ మని సూచించాడు.

ఆ రోజు నుంచీ బాలుడు ఉదయం లేచినప్పటి నుంచి నిరవధికంగా రామనామాన్ని జపించనారంభించాడు. దాని ప్రభావంతో ఏకసంథాగ్రాహిగా మారిపోయాడు. అక్షరంముక్క రాదని అందాకా ఎగతాళికి గురైన ఆ బాలుడు అనతి కాలంలోనే తరగతిలో అత్యుత్తమ విద్యార్థిగా గురువుల మన్ననలు అందుకున్నాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల పట్టాలు పొందాడు. చదువే రాదేమో అనుకుంటే.. చదువు చెప్పే అధ్యాపకుడయ్యాడు. ఆనక ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయ్యాడు. భారత రెండో రాష్ట్రపతిగానూ ప్రకాశించాడు. రామనామంతో తల రాతనే మార్చుకున్న ఆ మహానుభావుడు మరెవరో కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌. వారికి రామనామ ఉపదేశాన్ని ప్రసాదించిన వారు సర్వేపల్లి నరసింహన్‌. కాలాంతరంలో వారే రమణ మహర్షి ప్రత్యక్ష శిష్యులైన స్వామి ప్రణవానంద.

- సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని