శునకం చెప్పిన తీర్పు

శ్రీరామచంద్రుడి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాముణ్ణి దర్శించుకోవాలనే తపనతో వచ్చేవారే కానీ కోరికలతో వచ్చేవారు కారు. ఒకరోజు ఉదయం రాముడు ధర్మసభలో మంత్రిపురోహితులతో కొలువు...

Published : 09 Jun 2022 01:23 IST

కథాస్రవంతి

శ్రీరామచంద్రుడి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాముణ్ణి దర్శించుకోవాలనే తపనతో వచ్చేవారే కానీ కోరికలతో వచ్చేవారు కారు. ఒకరోజు ఉదయం రాముడు ధర్మసభలో మంత్రిపురోహితులతో కొలువు తీరి ఉండి లక్ష్మణుడితో ద్వారం వద్ద ఎవరైనా కార్యార్థులై వచ్చారేమో చూడమని చెప్పాడు. తమ్ముడు చూసి వచ్చి ఎవరూ లేరన్నాడు. రాముడు ఇంకోసారి చూడమన్నాడు. అక్కడ పౌరులెవరూ లేరు. కానీ, ఒక కుక్క మొరుగుతూ కనిపించింది. లక్ష్మణుడు దాని దగ్గరగా వెళ్లి ‘మహానుభావా! నీకేం కావాలో చెప్పు’ అనడిగాడు. ‘నేను రాముడితోనే విన్నవించు కుంటాను’ అంది శునకం. లక్ష్మణుడు దాన్ని రాముడి ఎదుట ప్రవేశపెట్టాడు. ఆ శునకరాజం ముందుగా రాముడెంత ధర్మాత్ముడో ప్రశంసించి ‘సర్వార్థసిద్ధుడు అకారణంగా నా తల మీద కొట్టాడు’ అంటూ తలమీద గాయాన్ని చూపింది. వెంటనే అతణ్ణి పిలిపించి సంజాయిషీ అడగ్గా నేరాన్ని అంగీకరించాడు. భిక్ష దొరక్క చికాకుపడుతున్న సమయంలో బాట మధ్యలో ఉండి, అదిలించినా అడ్డు తొలగకపోవడంతో కోపావేశంతో కొట్టిన మాట వాస్తవమేనన్నాడు. తనని శిక్షించి, నరకబాధ నుంచి తప్పించమని కోరాడు. ఆ తప్పుకు ఏ శిక్ష విధించాలని రాముడు మంత్రులను అడిగాడు. వారు ‘బ్రాహ్మణుడికి మరణశిక్ష విధించకూడదు, అయినా తమరు ధర్మస్వరూపులు. మీకు మేమేం చెప్పగలం?’ అన్నారు. అప్పుడా శునకం ‘రామా! నాకు కావలసింది చేస్తానన్నావు కదా! ఇతణ్ణి కౌలంచర మఠాధిపతిగా నియమించు’ అంది. రాముడు సరేనన్నాడు. ఆ భిక్షువు మఠాధిపతి పదవి స్వీకరించి, ఏనుగునెక్కి ఆనందంగా వెళ్లిపోయాడు. మంత్రులు ఆశ్చర్యపోతుంటే రాముడి ఆదేశంతో శునకం అలా కోరిన కారణాన్ని వివరించింది. ‘నేను పూర్వజన్మలో కౌలంచర మఠాధిపతిని. ఎంతో ధర్మంగా నీతినియమాలతో, మంచి నడవడితో వినయంగా ఉండేవాణ్ణి. తెలిసి ఎన్నడూ ధర్మం తప్పలేదు. అయినా ఈ జన్మ వచ్చింది. ఈ బ్రాహ్మణుడు కోపిష్టి, ధర్మవర్తనం లేనివాడు, కఠినాత్ముడు. కనుక నరకానికి పోవటం తథ్యం’ అని వెళ్లిపోయింది శునకం.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని