జ్ఞాననిధి కపిలగీత

కపిలమహర్షి తన తల్లి దేవహూతికి బోధించిన ఆధ్యాత్మిక, యోగ, విద్యారహస్య నిధి కపిలగీత. ఇది భాగవతం తృతీయ స్కంధంలో ఉంది. మైత్రేయ మహాముని విదురుడికి నైమిశారణ్యంలో కపిలమహర్షి వృత్తాంతం వివరించాడు.

Updated : 16 Jun 2022 03:34 IST

పిలమహర్షి తన తల్లి దేవహూతికి బోధించిన ఆధ్యాత్మిక, యోగ, విద్యారహస్య నిధి కపిలగీత. ఇది భాగవతం తృతీయ స్కంధంలో ఉంది. మైత్రేయ మహాముని విదురుడికి నైమిశారణ్యంలో కపిలమహర్షి వృత్తాంతం వివరించాడు. అదే కపిలగీత. స్వాయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ఇద్దరూ సప్త ద్వీపాలతో కూడిన భూమండలాన్ని ధర్మ బద్ధంగా పాలించారు. స్వాయంభువ మనువు కుమార్తె దేవహూతి కర్దమ ప్రజావతిని వివాహమాడింది. కర్దమ ముని వలన తొమ్మిదిమంది పుత్రికలకు జన్మనిచ్చింది దేవహూతి. తానిక సన్యసించాలి అనుకున్నాడు కర్దముడు. కానీ తనకు ఇంకొక్క కుమారుణ్ణి ప్రసాదించి, కన్యాదాన కార్యక్రమాలు నిర్వహించి, ఆ ఫలాన్ని అనుగ్రహించి సన్యసించమని వేడుకుంది దేవహూతి. అప్పుడు కర్దమ మునికి శ్రీమహావిష్ణువు తన భార్య గర్భంలో జన్మించగలనని చేసిన వాగ్దానం జ్ఞాపకమొచ్చింది. సరేన్నాడు. విష్ణువు అంశతో ఆ తర్వాత జన్మించినవాడే కపిలుడు. సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అయిన ఆ కపిల మహర్షిని దేవహూతి ఆత్మజ్ఞానాన్ని బోధించమని ప్రార్థించింది. అప్పుడు తల్లికి ఆ మహర్షి ఎన్నెన్నో ఆధ్యాత్మిక యోగ విద్యా రహస్యాలను బోధించాడు. అలా కపిలుడు బోధించినదంతా కపిల గీత అయింది. జీవుడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, పిండోత్పత్తి క్రమం, గర్భంలో ఏ నెలలో ఎలాంటి మార్పులను పిండం పొందుతుంది, అవయవాలు, ప్రాణం ఎప్పుడు ఎలా జతకూడతాయి- ఇలాంటి విషయాలన్నీ కపిలగీతలో ఉండటం విశేషం. నేటి ఆధునిక వైద్య శాస్త్రం పిండ పరిణామాలను గురించి వివరించేవన్నీ ఇందులో చూడొచ్ఛు మన భారతీయ రుషి విజ్ఞాన ఔన్నత్యానికి కపిల గీత ఓ మచ్చుతునక.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని