దేవతలు స్మరించే పేర్లు!

ఒకరోజు శ్రీమహావిష్ణువూ, లక్ష్మీదేవి సంభాషణలో భక్తుల ప్రస్తావన వచ్చింది. అనుక్షణం భగవన్నామ స్మరణ చేసేవాళ్ల జాబితా తయారుచేస్తున్నారు.

Updated : 16 Jun 2022 03:40 IST

కరోజు శ్రీమహావిష్ణువూ, లక్ష్మీదేవి సంభాషణలో భక్తుల ప్రస్తావన వచ్చింది. అనుక్షణం భగవన్నామ స్మరణ చేసేవాళ్ల జాబితా తయారుచేస్తున్నారు. ఇంతలో నారదుడు వచ్చి, ‘ఏం చేస్తున్నారు స్వామీ?’ అనడగ్గా ‘అహోరాత్రులు దైవాన్ని స్మరించే భక్తుల జాబితా’ అన్నాడు విష్ణుమూర్తి. ‘అయితే అందులో నా పేరే ముందుంటుంది’ అన్నాడు నారదుడు.

విష్ణుమూర్తి మౌనంగా నారదుడి చేతికిచ్చాడు. నారదుడి ఊహ నిజమే అయ్యింది. ఆయన పేరే అందరి కన్నా పైనుంది. అయితే అనుక్షణం రామ నామస్మరణ చేసే హనుమ పేరు ఆ జాబితాలో లేనే లేదు. నారదుడు ఆశ్చర్యపోయాడు. ఆయన కాసేపు కూడా ఏదీ కడుపులో దాచుకో లేడు కదా! వెంటనే హనుమంతుడి వద్దకు వెళ్లి ఆ విషయాన్ని వివరించాడు. హనుమకు నలుసంత కోపం రాలేదు. అసలదో విషయమే కాదన్నట్లు ‘నారదా! నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తావు కదా! నీ పేరు ఉండటమే సముచితం’ అంటూ శాంతంగా సమాధానం చెప్పి రామనామ జపంలో నిమగ్నమైపోయాడు.

కొంతకాలం తర్వాత నారదుడు మళ్లీ వైకుంఠం వెళ్లాడు. విష్ణుమూర్తి చేతిలో మళ్లీ జాబితా కనిపించడంతో ‘ఇదేమిటి ప్రభూ?’ అనడిగాడు. ‘ఈసారి నిరంతరం మేం స్మరించే భక్తుల పేర్లు రాస్తున్నాం’ అన్నాడు విష్ణుమూర్తి. కుతూహలంగా అందుకుని చూసిన నారదుడికి కళ్లు బైర్లు కమ్మాయి. జాబితాలో హనుమంతుడి పేరు పైన ఉంది. తన పేరు ఎక్కడా లేకపోవడంతో మౌనంగా అక్కణ్ణించి వెళ్లిపోయాడు.

ప్రేమించడం కన్నా ప్రేమను అందుకోవడం ఎంత గొప్ప సంగతో నారదుడికి బోధపడింది.

- సాయి అనఘ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని