Updated : 16 Jun 2022 03:33 IST

కోర్కెలు తీర్చే స్వామి

డప జిల్లా లింగాల మండలంలోని వెలిదండ్ల గ్రామానికి ఆ పేరెలా వచ్చిందో చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ ప్రాంతానికి ఎగువ భాగాన వరదరాజస్వామి ఆలయం వెలిసింది. అక్కడ నివాసం ఉంటున్నవాళ్లు వేకువజామున లేచి మజ్జిగ చిలికేవారు. ఈ సవ్వడికి వరదరాజస్వామికి నిద్రాభంగమై వారిని ఆలయానికి దూరంగా వెళ్లిపొమ్మన్నాడు. దాంతో వెలిదండ్ల అనే పేరు స్థిరపడిందట.

స్థల పురాణాన్ని అనుసరించి ద్వాపరయుగంలో జనమేజయుని తండ్రి పరీక్షిత్‌ మహారాజు సర్ప కాటుకు గురై మరణించాడు. తన తండ్రి ఒంటి స్తంభపు అద్దాల మేడలో నివసిస్తున్నప్పటికీ.. పండులో పురుగు రూపంలో చేరిన సర్పం ఆయన్ను కాటేసింది. అది తెలుసు కొని పాముల వినాశనానికి జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. దానివల్ల అనర్థాలు కలిగాయి. వాటి నివారణకు 108 వైష్ణవ ఆలయాలను నిర్మించాలని గురువులు సూచించడంతో ఆయన అనేక ఆలయాలను నిర్మించడం ఆరంభించారు. వాటిలో ఒకటి వెలిదండ్ల సమీపంలోని దేవరకోనలో రూపుదిద్దుకున్న వైష్ణవ ఆలయం.

ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం కోనేరులో నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగును మొసలి నుంచి కాపాడి కరివరదుడయ్యాడు స్వామి.

ఆలయ పరిసర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు పడదు. కానీ 8 అడుగుల లోతు మాత్రమే ఉన్న ఆలయ కోనేరు మట్టుకు ఎన్నడూ ఎండిపోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు స్థానికులు.

వరదరాజ స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారిక్కడ. కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

పులివెందుల నుంచి పాతిక కి.మీ.ల దూరంలో ఉన్న వెలిదండ్లకు అరగంటకో బస్సు ఉంటుంది.

- బి. విశాల్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని