కనురెప్పలెందుకు మూసుకుంటాయి?

శ్రీరాముడి వంశకర్త అయిన ఇక్ష్వాకువు పన్నెండో కుమారుడు నిమి. అతడు గొప్ప ధర్మాత్ముడు. ప్రజాక్షేమం కోసం తలపెట్టిన యజ్ఞాన్ని నిర్వహించమంటూ కులగురువు, పురోహితుడు అయిన వశిష్టుణ్ణి ఆహ్వానించాడు నిమి చక్రవర్తి.

Updated : 16 Jun 2022 03:32 IST

శ్రీరాముడి వంశకర్త అయిన ఇక్ష్వాకువు పన్నెండో కుమారుడు నిమి. అతడు గొప్ప ధర్మాత్ముడు. ప్రజాక్షేమం కోసం తలపెట్టిన యజ్ఞాన్ని నిర్వహించమంటూ కులగురువు, పురోహితుడు అయిన వశిష్టుణ్ణి ఆహ్వానించాడు నిమి చక్రవర్తి.

కానీ వశిష్టుడు అప్పటికే ఇంద్రుడి యజ్ఞనిర్వహణకు అంగీకరించినందున.. తక్షణం రాలేనని, దాన్ని పూర్తిచేసి వచ్చేవరకు ఆగమని చెప్పాడు. అయితే నిమి ఆయనకోసం ఆగకుండా అత్రి, గౌతమ, అంగీరస మహర్షుల తోడ్పాటుతో యజ్ఞం ప్రారంభించి, కొనసాగిస్తున్నాడు.

ఇంద్రుడి యజ్ఞం పూర్తిచేసి వచ్చిన వశిష్టుడు.. నిమి యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకుని, రగిలిపోయాడు. నిమిని కలిసేందుకు వెళ్లి కొద్దిసేపు ఎదురుచూశాడు. కానీ ఆరోజు నిమి చక్రవర్తి పగటిపూట నిదురించాడు. దాంతో వశిష్టుడి కోపం మరింత పెరిగింది. ‘నన్ను కాదని యజ్ఞం చేయడమే గాక మంచి చెప్పటానికి వచ్చిన తనకు దర్శనం కూడా ఇవ్వలేదు. ఇంత అవమానం చేసినందుకు చైతన్యహీనుడివి అగుదువు గాక!’ అని శపించాడు.

అది విన్న నిమిచక్రవర్తి ఆగ్రహించి, ‘నేను నిద్రిస్తున్నప్పుడు అన్యాయంగా శపించి నందున నువ్వు కూడా చైతన్యహీనంగా పడి, దేహం చెడకుండా ఉందువు గాక!’ అంటూ ప్రతిశాపం ఇచ్చాడు. కోపం ఎంత పనైనా చేయిస్తుంది మరి.

రుషులు నిమి శరీరాన్ని కాపాడుతూ యజ్ఞం కొనసాగిస్తున్నారు. యజ్ఞం పూర్తి కాబోతుండగా భృగుమహర్షి నిమి ఆత్మను ఉద్దేశించి ‘నువ్వేం వరం కోరుకుంటావు? నీ ప్రాణాన్ని ఎక్కడ నిలపమంటావు?’ అనడిగాడు.

నిమి ఆయువు తీరకుండా చనిపోవడాన అతడి ఆత్మ పైలోకానికి వెళ్లలేదు. కనుక అది ఉండటానికి తగిన తావును చూడాలి. దేవతలూ అదే అడగ్గా.. తాను ప్రాణులన్నిటి దృష్టిలో ఉండేట్లు చేయమని అడిగాడు నిమి. దేవతలు అలాగేనంటూ ‘అన్నిప్రాణుల రెప్పల్లో వాయురూపంలో ఉండు! నీవల్లనే సర్వప్రాణులూ రెప్ప వేయగలుగుతాయి. ప్రాణుల అలసట తీరటానికి రెప్పలు మూయటం తప్పనిసరి’ అంటూ వరమిచ్చి అంతర్థానమయ్యారు. మునులు నిమి శరీరాన్నే అరణిగా చేసి, కొడుకు పుట్టాలని కోరుతూ మథించారు. ఆ మథనం నుంచి పుట్టిన మిథి, అనంతర కాలంలో జనకుడిగా ప్రసిద్ధి పొందాడు.

- రాహుల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని