Published : 23 Jun 2022 01:26 IST

జీవన మార్గదర్శి వ్యాధగీత

గీతలెన్ని?!

వ్యాధగీత మహాభారతం అరణ్యపర్వం పంచమాశ్వాసంలో ఉంది. మనిషి మహోన్నతుడుగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎవరిని ధర్మాత్ములంటారు- లాంటి విషయాలతోబాటు ధర్మసూక్ష్మాలు, హింస అంటే ఏమిటో కూడా చక్కటి నిర్వచనాలను ఇచ్చింది ఈ గీత. మాంసం అమ్ముకుని జీవించే ధర్మవ్యాధుడనే కటికవాడు కౌశికుడనే బ్రాహ్మణుడికి చేసిన ధర్మబోధ వ్యాధగీతగా ప్రసిద్ధమైంది. అరణ్యవాస సమయంలో ధర్మరాజుకు మార్కండేయ మహాముని దీన్ని బోధించాడు. ప్రత్యక్ష దేవతలైన తల్లి, తండ్రి, గురువులకు నిత్యం సేవచేయటం వల్ల కలిగే సత్ఫలితాల వివరణే ఇందులో ప్రధానాంశం. కేవలం పుట్టిన జాతి, చేసే వృత్తిని బట్టి మనిషి గొప్పతనాన్ని అంచనా వేయకూడదు. అతడి ప్రవర్తనే కొలమానం.. అనే విషయాలు ఈ గీతలో కనిపిస్తాయి. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన కౌశికుడికి మాంసం అమ్ముకుని జీవించే వ్యక్తి సన్మార్గాన్ని సూచిస్తాడు. ఎంత చదివినా వాటి సారాన్ని ఒంట పట్టించుకోని కౌశికుడు కొంతకాలం తపస్సు చేశాడు. అయినా కోపం, అసహనం, అహంకారం తగ్గించుకోలేకపోయాడు. ఏదో సాధిద్దామనే భ్రమలో తన మీద ఆధారపడిన ముసలి తల్లిదండ్రులను పట్టించుకోకుండా అడవికి వెళ్లి వేదాధ్యయనం చేయసాగాడు. ఒకనాడు చెట్టు మీది కొంగ రెట్ట అతనిపై వేసింది. కోపంతో కౌశికుడు చూసిన చూపునకు అది చనిపోయింది. దాంతో తనకేవో గొప్ప శక్తులొచ్చాయనుకున్నాడే తప్ప, చేసిన పనికి పశ్చాత్తాపం చెందలేదు. ఆ తర్వాత సమీపంలోని ఊళ్లోకి వెళ్లి ఓ ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగాడు. అయితే ఆకలితో వచ్చిన భర్తకు సేవచెయ్యటంలో నిమగ్నమైన ఇల్లాలు భిక్షను ఆలస్యంగా తెచ్చింది. కౌశికుడు ఆగ్రహించగా ‘నీ కోపానికి చచ్చి కిందపడటానికి నేను అడవిలో చెట్టు మీది కొంగననుకున్నావా?’ అందామె. ఖంగు తిన్న కౌశికుడు ‘ఎలా తెలిసింది? ఇంత జ్ఞానం ఏ తపస్సుతో వచ్చింది?’ అనడిగాడు. ‘నేను ఇల్లాలిగా నా విధులేమిటో సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. అంతే! మరింత జ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో మాంసం అమ్ముకునే ధర్మాచరణుడైన ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్లు’ అంది. అలా వెళ్లిన కౌశికుడికి మరింత ఆశ్చర్యం వేసింది. ధర్మవ్యాధుడు ఎదురొచ్చి సత్కరించి ‘పతివ్రత పంపింది కదా’ అన్నాడు. ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. ‘హింసాత్మకమైన మాంసం అమ్ముతూ జీవిస్తున్న నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది?’ అన్నాడు కౌశికుడు. ‘నేను నా తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తుంటాను, నా వృత్తిని ధర్మబద్ధంగా చేస్తుంటాను, అంతే! నువ్వూ ఇంటికెళ్లి నిన్నే నమ్ముకున్న అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో! జ్ఞానం, శక్తులు అవే వస్తాయి’ అన్నాడు ధర్మవ్యాధుడు. ఇదే ఈ గీతా సారం.

- గంగరాజు ఇందిరాశేషు


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని