ఫలించిన అన్వేషణ

ఆచార్య నాగార్జునుడు మనదేశంలోనే సుప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త. ఆయనకు తన ప్రయోగశాలలో పనిచేసేందుకు ఓ వ్యక్తి కావలసి వచ్చింది. ఆ వ్యక్తి ప్రజలకు దగ్గరివాడుగా ఉంటూ విసుగన్నది లేకుండా విధులు నిర్వర్తించాలి.

Published : 23 Jun 2022 01:26 IST

గురూపదేశం

చార్య నాగార్జునుడు మనదేశంలోనే సుప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త. ఆయనకు తన ప్రయోగశాలలో పనిచేసేందుకు ఓ వ్యక్తి కావలసి వచ్చింది. ఆ వ్యక్తి ప్రజలకు దగ్గరివాడుగా ఉంటూ విసుగన్నది లేకుండా విధులు నిర్వర్తించాలి. ఈ విషయం తెలిసిన ఎందరో తమకు అవకాశం కల్పించమని అడగసాగారు.

ఒకరోజు ఓ యువకుడు వచ్చి ‘గురువర్యా! మీ వద్ద పనిచేయాలని ఉంది. అవకాశం కల్పించండి. శ్రద్ధగా పనిచేసి మిమ్మల్ని మెప్పిస్తాను’ అన్నాడు. ‘సరే! నేనో పని చెబుతాను. వారం రోజుల్లో నువ్వా పని పూర్తిచేసుకుని రాగల్గితే నిన్ను తప్పకుండా చేర్చుకుంటాను. రసాయన విద్యలో మెలకువలు నేర్పుతాను’ అన్నాడు. ఆ వెంటనే అతడికి ఓ పని అప్పజెప్పాడు.

సరేనని వెళ్లిన యువకుడు తొమ్మితో రోజు తిన్నగా వచ్చి ‘ఆచార్యా! నేను మీ శిష్యుడిగా ఉండటానికి ఏమాత్రం తగినవాణ్ణి కాను. నన్ను మన్నించండి’ అన్నాడు. ‘ఎందుకు నాయనా! ఏమైంది? వారం గడువిచ్చాను కదా?!’ అన్నాడు నాగార్జునుడు. ‘గురుదేవా! మీరు అప్పగించిన పని నాలుగురోజుల్లోనే చేసి మీ మెప్పు పొందాలనుకున్నాను. కానీ ఒక రోగి కనిపించాడు. దిక్కులేకుండా ఉన్న అతడి పరిస్థితి చూసి జాలేసి అతణ్ణే కనిపెట్టుకుని ఉన్నాను. ఇప్పుడతడి పరిస్థితి కుదుటపడింది. మీరు ఆశించిన నిబద్ధత చూపలేకపోయాను. క్షమించండి. గురువుగారి మాట జవదాటిన వ్యక్తికి ఆయన దగ్గరుండే అర్హత లేదు’ అన్నాడు.

‘నాయనా! నేను అన్వేషిస్తోంది నీలాంటివాడి కోసమే. మొక్కుబడిగా పనిచేయడం కాదు, సాటి వ్యక్తుల పట్ల దయ, సానుభూతి, సేవాదృక్పథం ఉన్నవ్యక్తే కావాలి’ అన్నాడు నాగార్జునుడు, అతడి భుజం తట్టి ఆనందంగా.

- శివరాజేశ్వరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని