గురుశిష్య బంధ దీపిక... గురుగీత

మన సనాతన సంప్రదాయంలో గురువు స్థానాన్ని దర్శింపచేస్తుంది గురుగీత. గురుశిష్య బంధ విశిష్టత, శిష్యుల విధులు, లక్ష్యాలకు అద్దంపడుతుంది. స్కాంద పురాణంలోని శివపార్వతీ సంవాదాత్మకంగా సాగే ఈ గీతలో 352 శ్లోకాలతో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఉత్తమోత్తములైన గురువు, శిష్యుల లక్షాలూ

Updated : 30 Jun 2022 03:21 IST

మన సనాతన సంప్రదాయంలో గురువు స్థానాన్ని దర్శింపచేస్తుంది గురుగీత. గురుశిష్య బంధ విశిష్టత, శిష్యుల విధులు, లక్ష్యాలకు అద్దంపడుతుంది. స్కాంద పురాణంలోని శివపార్వతీ సంవాదాత్మకంగా సాగే ఈ గీతలో 352 శ్లోకాలతో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఉత్తమోత్తములైన గురువు, శిష్యుల లక్షాలూ, లక్షణాలూ, వారి ప్రవర్తనా విధానం, సేవలందించాల్సిన విధివిధాలను పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు.
గురువు జ్ఞానాన్ని సృష్టించి, దాన్ని స్థాపించి, అజ్ఞానాన్ని లయింపచేసి.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానుడయ్యాడు. అలాంటి గురుదేవుని తాను నిత్యం స్మరిస్తూ ధ్యానిస్తుంటానన్నాడు శివుడు. అజ్ఞానమే అవిద్య. అవిద్యను పోగొట్టి జ్ఞానకాంతులను దర్శింపచేస్తాడు గురువు.

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్‌
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః

ప్రపంచమంతా పరమాత్మగా వ్యాపించి ఉండేవాడే గురువు. ఆయన చైతన్య పరబ్రహ్మాన్ని దర్శింపచేస్తుంటాడు. అందుకే గురువుకు నమస్కరిస్తుంటాను అన్నాడు సాక్షాత్తూ ఈశ్వరుడు. స్థావర జంగమాత్మకమైన చరాచర ప్రపంచాన్ని చైతన్యకారకమైన శాంతం, నిర్మలం, నిత్యం, నిర్వికారం, నిష్కలంకమైన పరబ్రహ్మ స్థితిగతులను వివరించగల గురువు అందరికీ వందనీయుడు అని గురుగీత స్పష్టం చేస్తోంది.
‘సంసార సాగర సముద్ధరణైక మంత్రమ్‌ బ్రహ్మాది దేవ మునిపూజిత సిద్ధమంత్రమ్‌ దారిద్య్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహా భయహరం గురురాజ మంత్రమ్‌’ అంటూ గురుమంత్ర విశిష్టతను పార్వతికి వివరించాడు శివుడు. దీన్ని మించిన మంత్రం లేదు. అది భవసాగరాన్ని దాటించగల శక్తిసంపన్నమైనది. తరుణోపాయాన్ని ఉపదేశించి పరబ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది. నిత్యం స్మరిస్తే సకల దారిద్య్రాలను నశింపచేస్తుంది. సర్వవ్యాధులను నివారించి ఆయుష్షు పెంచుతుంది. ధైర్య స్థైర్యాలను ప్రసాదిస్తుంది. అలాంటి అఖండ స్వరూపుడైన గురు పరబ్రహ్మకు అందరూ విధిగా సమస్సులర్పించాలి. ‘జపి గురు గీతా మిమాందేవి భవదుఃఖ వినాశినీం గురుదీక్షా విహీనస్య పురతోన పఠేత్‌ క్వచిత్‌’ గురు పరబ్రహ్మను దర్శింపచేసి, పుణ్య సముపార్జనకు దోహదం చేస్తుందిది. సంసార దుఃఖ సాగరాన్ని సంపూర్ణంగా నశింపచేస్తుంది. సంస్కారవంతమైన జన్మను పొందడానికి గురుగీతను పఠించాలనే ప్రబోధం గురుగీత చదివినవారికి అందుతుంది.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని