నమ్మితే మాటే మంత్రం

పూర్వం ఏటి ఒడ్డున ఓ ఆలయం ఉండేది. అందులో పూజారి గొప్ప పండితుడు. సదా మంచి మాటలు చెప్పడంతో అందరూ ఆయన్ను గౌరవించేవారు. ఆ ఆలయానికి ఒక ఒక వనిత రోజూ ఆవుపాలు తెచ్చి ఇచ్చేది

Updated : 30 Jun 2022 03:28 IST

పూర్వం ఏటి ఒడ్డున ఓ ఆలయం ఉండేది. అందులో పూజారి గొప్ప పండితుడు. సదా మంచి మాటలు చెప్పడంతో అందరూ ఆయన్ను గౌరవించేవారు. ఆ ఆలయానికి ఒక ఒక వనిత రోజూ ఆవుపాలు తెచ్చి ఇచ్చేది. పూజారి ఆ పాలను అభిషేకానికీ, నివేదనకూ ఉపయోగించేవాడు. ఆమె ఏటికి అవతలి గ్రామంలో ఉండేది. ఒకరోజు ఆమె పాలు తేలేదు. మర్నాడు ఆలయ పూజారి ఎందుకు రాలేదని అడిగితే.. వాన కురిసి ఏరు పొంగినందున రాలేకపోయానని చెప్పింది. ‘నువ్వు ఇంతగా నమ్ముకున్న దేవుడి నామం తలచుకుంటే ఏరు దాటడం కష్టం కాదు. ఆయన సంసార సముద్రాన్నే దాటించగలడు’ అన్నాడు పూజారి. ఆ అమాయకురాలు ఆయన్ను గురువుగా భావించేది. మరోసారి మరింత పెద్ద వాన పడి, ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ‘ఈ రోజు కూడా దేవుడికి అభిషేకానికీ, నివేదనకీ పాలు ఉండవు’ అని నిరాశచెందాడు పూజారి. కానీ ఆశ్చర్యంగా ఆ స్త్రీ పాలు తీసుకొచ్చింది. ‘ఎట్లా వచ్చావు?’ అనడిగాడు పూజారి. ‘స్వామీ! మీరు చెప్పినట్టు దేవుణ్ణి తలచుకుంటూ ఏటి మీద నడిచి వచ్చేశాను’ అందామె. పూజారి అవాక్కయ్యాడు. తన మాటనూ, దేవుణ్ణీ నిస్సందేహంగా నమ్మిన ఆ వనితది నిజమైన భక్తి అని, తాను కూడా అంతటి భక్తి పెంపొందించుకోవాలని అనుకున్నాడు. తెలిసిన జ్ఞానానికీ, దాన్ని ఆచరణలో పెట్టటానికీ ఉన్న తేడా ఇదేనని ఉపనిషత్తు చెబుతుంది.
త్రికరణశుద్ధిగా నమ్మినప్పుడు మాట మంత్రమౌతుంది. మంత్రం ఫలిస్తుంది.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని