మనజాతి ఖ్యాతిగీతిక భరతగీత

జడభరతుడనే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు సింధు సౌవీరదేశ రాజైన రహూగణ మహారాజుకు చేసిన ఆధ్యాత్మ జ్ఞానబోధ భరతగీతగా ప్రసిద్ధి చెందింది. ఇది భాగవతం పంచమ స్కందలో ఉంది.

Published : 07 Jul 2022 00:55 IST

డభరతుడనే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు సింధు సౌవీరదేశ రాజైన రహూగణ మహారాజుకు చేసిన ఆధ్యాత్మ జ్ఞానబోధ భరతగీతగా ప్రసిద్ధి చెందింది. ఇది భాగవతం పంచమ స్కందలో ఉంది.

ఋషభదేవుని కుమారుడైన భరతుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. రాజు విశ్వరూపుని కుమార్తె పంచజననిని పెళ్లాడాడు. వారికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్ర కేతువు అనే ఐదుగురు కుమారులు కలిగారు. భరతుడు శుద్ధచిత్తంతో, ధర్మదీక్షతో పాలించాడు. అంతకుముందు ఈ భూభాగాన్ని అజనాభమని పిలిచేవారు. ఈ భరతుడు పాలించినందున భరతవర్షమని పేరొచ్చింది.

కొన్నాళ్లకు విరక్తుడై రాజ్యాన్ని, భోగభాగ్యాలనూ, అపార సంపత్తినీ వదిలిపెట్టి పులహాశ్రమానికి వెెళ్లాడు. ఒకరోజు భరతుడు గండకీనదిలో స్నానంచేసి ప్రణవ మంత్రాన్ని జపిస్తుండగా సింహగర్జన వినిపించింది. నిండుచూలాలుగా ఉన్న లేడి భయంతో నదిలోకి దూకి అక్కడే ప్రసవించి చనిపోయింది.

భరతుడు దాన్ని చూసి కరుణా రసభరితుడై మాతృహీనయగు లేడిపిల్లను తన ఆశ్రమంలోనే పెంచుకుంటాడు. దాని పట్ల స్నేహబంధంతో అతడి ఆత్మ బంధించినట్లయ్యింది. మృగజాతిలో పుట్టిన జింకపిల్లపై మమకారం పెంచుకుంటూ అంత్యకాలంలో కన్నకొడుకులా దాన్ని అనురాగంతో చూస్తూ దాన్నే తలచుకుంటూ కన్నుమూశాడు. ఆ భవబంధంతో తర్వాతి జన్మల్లో ఆయన పడిన కష్టాలను చెబుతూ దాంతోబాటే ఆధ్యాత్మ ప్రబోధాన్ని అందిస్తుంది భరతగీత. 

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని