సీతకు నీతి చెప్పిన జాంబవంతుడు

రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనంలో దాచాడు. నిత్యం భయ భ్రాంతులకు గురిచేసే రాక్షస స్త్రీల మధ్య సీతమ్మతల్లి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఎప్పటికైనా రాముడు రాకపోతాడా, తనను రక్షించకుంటాడా అనుకునేది. అంతమంది

Published : 07 Jul 2022 00:55 IST

రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనంలో దాచాడు. నిత్యం భయ భ్రాంతులకు గురిచేసే రాక్షస స్త్రీల మధ్య సీతమ్మతల్లి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఎప్పటికైనా రాముడు రాకపోతాడా, తనను రక్షించకుంటాడా అనుకునేది. అంతమంది రాక్షసకాంతల మధ్య విభీషణుడి కుమార్తె త్రిజట మాత్రం సీతతో స్నేహంగా మెలిగేది. రాముడు వానర సైన్యంతో వచ్చి   లంకను జయించినట్లుగా తనకు కల వచ్చిందనీ, సీతతో సేహంగా ఉండమనీ తోటి రాక్షసకాంతలతో చెప్పింది.

ఒకరోజు త్రిజట సీతను కొంతదూరం తీసుకెళ్లి దినుసులు నూరుకునే సన్నెకల్లును అపురూపంగా చూపింది. అందులో ఏం గొప్పదనముందో అర్థంకాక సీత ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు త్రిజట ‘దీనిమీద నూరే దినుసులు రెట్టింపు సుగంధంతో పరిమళిస్తాయి’ అని చెప్పగా సీత ఆశ్చర్యపోయింది. తాను అయోధ్యకు వెళ్లేటప్పుడు ఎలాగైనా దాన్ని తీసుకెళ్లా లనుకుంది. రావణాసుర వధ తర్వాత సీతమ్మ హనుమంతుణ్ణి పిలిచి ‘నాయనా! ఈ సన్నెకల్లు ఎంతో విశిష్టమైంది. దీన్ని అయోధ్యకు తీసుకెళ్లాలనుంది. భద్రంగా పెకలించుకురా’ అంది.

హనుమంతుడు సన్నెకల్లు విరక్కుండా నెమ్మదిగా పైకి తీస్తున్నాడు. ఇంతలో జాంబవంతుడు వచ్చి ఏంచేస్తున్నావని అడిగాడు. హనుమంతుడు వివరించాడు. అది విన్న జాంబవంతుడు సీత దగ్గరికెళ్లి ‘అమ్మా! రామయ్య ఈ లంక సమస్తాన్ని విభీషణుడికి దానమిచ్చాడు కదా! అలా ఇచ్చిన దానం నుంచి ఒక వస్తువు కావాలని ఆశించడం పాపం. ఏదైనా దానమిచ్చి ప్రతిఫలాన్ని ఆశించడం, లేదా దానం చేసిన విషయాన్ని బహిరంగపరచడం, దానం తీసుకున్నవారు అభిమానంతో అందులోంచి కొంత తిరిగివ్వడం- ఇవన్నీ దానఫలితాన్ని నశింపజేస్తాయమ్మా’ అన్నాడు. అది విన్న సీత తమ దానఫలం నాశనం కాకుండా కాపాడినందుకు జాంబవంతుణ్ని ఎంతగానో మెచ్చుకుంది. ఆ సన్నెకల్లును అక్కడే వదిలేసి అయోధ్యకు బయల్దేరింది.
బెంగాలీలోని కృత్తివాస రామాయణంలో ఉందీ కథ.

- జి.జానకి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని