ఓటమితో స్నేహం

కార్తవీర్యార్జునుడి రాజధాని మహిష్మతీపురాన్ని అగ్నిదేవుడు రక్షిస్తుంటాడు. ఆ పరాక్రమవంతుడితో యుద్ధం చేయాలనే కుతూహలంతో రావణుడు వెళ్లాడు.

Published : 07 Jul 2022 00:55 IST

కార్తవీర్యార్జునుడి రాజధాని మహిష్మతీపురాన్ని అగ్నిదేవుడు రక్షిస్తుంటాడు. ఆ పరాక్రమవంతుడితో యుద్ధం చేయాలనే కుతూహలంతో రావణుడు వెళ్లాడు.

ఆ సమయానికి కార్తవీర్యార్జునుడు శత్రువులను గెలిచి వచ్చి, నర్మదానదిలో జలక్రీడలకు స్త్రీలతో వెళ్లాడు. ‘రణశూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకి చెప్పండి’ అన్నాడు రావణుడు. మంత్రులు రాజు ఊళ్లో లేడని చెప్పారు. రావణుడు మహిష్మతీనగరాన్ని వదిలి, వింధ్యపర్వత సమీపంలో విడిది చేసి, నర్మదలో స్నానం చేసి, శివార్చన చేసుకుంటానన్నాడు. అందాకా పరివారాన్ని జలక్రీడలతో ఆనందించమన్నాడు. వారు పూలు తెచ్చారు. అతడా ఇసుకలో సైకతవేదిక మీద బంగారు శివలింగాన్ని అర్చించి, సామగానంతోను, నృత్యంతోనూ సేవలు చేశాడు.

ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు జల క్రీడలాడుతూ బాహుబలాన్ని ప్రదర్శించేందుకు తన వేయిచేతులతో నర్మదా ప్రవాహాన్ని అడ్డగించాడు. దాంతో నీరు వెనక్కి ప్రవహిస్తూ రావణుడు శివపూజకి సిద్ధం చేసుకున్న పూలను చెల్లాచెదరు చేసింది. అప్పటికి రావణుడి పూజ సగమే అయింది. కారణం తెలుసుకోమని శుక సారణులకు సైగచేశాడు. వాళ్లు చూసొచ్చి ‘ఒకడు స్త్రీలతో జలక్రీడలాడుతూ తన వేయిచేతులతో నదిని అడ్డగిస్తున్నాడు’  అంటూ తెలియజేశారు.

రావణుడు అతడే కార్తవీర్యార్జునుడని గుర్తించి, మంత్రుల వద్దకు వెళ్లి ‘రాక్షసశ్రేష్ఠుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుతో చెప్పండి’ అన్నాడు. ‘రాజు జలక్రీడలాడుతున్నాడు. రేపు ఉదయం యుద్ధం చేస్తాడు. లేదంటే ముందు మాతో యుద్ధం చెయ్యి’ అన్నారు. రావణుడు యుద్ధానికి తలపడ్డాడు. ఈ వార్త తెలిసిన కార్తవీర్యార్జునుడు విజృంభించడంతో రావణుడి పరివారం భయపడింది. రావణుడు తానే ముందుకు వచ్చాడు. వరాలు పొంది ఉండటంతో ప్రాణాలు పోలేదు కానీ ఆ తాకిడి తట్టుకోలేకపోయాడు. నేలమీద పడిన రావణుణ్ణి అర్జునుడు నగరానికి బందీగా తీసుకెళ్లాడు.

ఇది తెలిసిన పులస్త్యుడు మహిష్మతీపురానికి రాగా నమస్కరిస్తూ ఎదురెళ్లి అర్ఘ్యపాద్యాలను, గోవులను, మధుపర్కాన్ని సమర్పించాడు కార్తవీర్యార్జునుడు. యోగక్షేమాలు అడిగి, పంచభూతాలను అధీనంలో ఉంచుకున్న తన మనవడు రావణుడి గర్వం అణచినందుకు మెచ్చుకుని, అతణ్ణి చెర నుంచి విడిచిపెట్టమని పులస్త్యబ్రహ్మ కోరడంతో రావణుణ్ణి విముక్తుణ్ణి చేశాడు కార్తవీర్యార్జునుడు. ఇద్దరు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు. ఓటమితో స్నేహం లభించింది.

 - డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని