కర్ణుడి కృతజ్ఞత

హస్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిశాక కర్ణ, భీష్మాదులతో కలిసి మేనత్త కుంతి దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడు. ఆమెను పరామర్శించి, రాయబార విశేషాలు వివరించాడు. ఆనక పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాన్ని తీసుకుని భీష్మ, సంజయులతో సహా వెనుతిరిగాడు.

Published : 07 Jul 2022 00:55 IST

స్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిశాక కర్ణ, భీష్మాదులతో కలిసి మేనత్త కుంతి దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడు. ఆమెను పరామర్శించి, రాయబార విశేషాలు వివరించాడు. ఆనక పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాన్ని తీసుకుని భీష్మ, సంజయులతో సహా వెనుతిరిగాడు. అందర్నీ తమ, తమ మందిరాలకు పంపించి, కర్ణుణ్ణి మాత్రం రథంపై కూర్చోబెట్టుకొని బయల్దేరాడు. రథం కొంత దూరం వెళ్లాక, ‘రాధేయా! నువ్వు ధర్మశాస్త్ర రహస్యాలు బాగా తెలిసినవాడివి. నీకు కొత్తగా చెప్పేదేమీ లేదు. నిజానికి మా మేనత్తకు ప్రథమ పుత్రుడివి కనుక రాజ్యాధికారం నీదే. దుర్యోధనుణ్ణి వదిలి నాతో వచ్చి పాండుపుత్రుల వైపు చేరు. అన్నగా నీకు బ్రహ్మరథం పడతారు. రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. అందుకు కుంతీమాత కూడా ఆనందిస్తుంది’ అన్నాడు గోవిందుడు.

కర్ణుడు మందహాసంచేసి ‘కేశవా! నీ వాత్సల్యానికి కృతజ్ఞుణ్ణి. ధర్మానుసారం పాండుపుత్రుణ్ణి అనే విషయం ఎప్పుడో తెలుసు నాకు. కానీ కుంతీదేవి నన్ను నదిలో పడేసినప్పుడు అతిరథుడు, రాధ నన్ను చేరదీశారు. ప్రాణప్రదంగా పెంచిన ఆ ప్రేమమూర్తుల రుణం ఎలా తీర్చుకోగలను? మరోవైపు ఏ ఆశ్రయం దొరక్క అవమానాలు పొందుతున్న వేళ దుర్యోధనుడు నన్ను ఆదరించి రాజ్యభాగాన్నిచ్చి, రాజును చేశాడు. సొంత సోదరుడిలా ఆదరించాడు. దుర్యోధనుడు నన్ను నమ్ముకునే ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. నాకు తెలుసు, ధర్మవర్తనులైన పాండవులే గెలుస్తారు. కానీ తల్లిదండ్రుల ప్రేమకు, మైత్రీబంధానికీ ద్రోహం చేయలేను. సమస్త భూమండలం రాసిచ్చినా, బంగారు రాశులు కురిపించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో అనుబంధాన్ని తెంచుకోలేను’ అన్నాడు. కర్ణుడి కృతజ్ఞతకు కృష్ణభగవానుడే కదిలిపోయాడు. అందుకే మహాభారతం ఉద్యోగపర్వంలో విదురుడు ‘ఒకరి పోషణతో ఉన్నత స్థానానికి చేరి, ఎందులోనూ కొరత లేకుండా జీవిస్తూ, అఖండ సంపదను ఆర్జించి, చివరికి ఆ దాత నమ్మకాన్నే వమ్ముచేసి అపకారం చేసేవారి పార్థివ దేహాన్ని కుక్కలు కూడా ఇష్టపడవు’ అన్నాడు ధృతరాష్ట్రుడితో.

 - చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని