Published : 21 Jul 2022 00:24 IST

ఇంద్ర ఉపేంద్రుల సంతోషం...

'విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు యజ్ఞపశువును అపహరించాడు. యజ్ఞపశువు పోతే ఆ దోషం రాజును చంపుతుంది. కనుక దాన్ని తెమ్మని అలా కుదరకపోతే ప్రత్యామ్నాయంగా ఓ మనిషిని తెమ్మని చెప్పాడు.

అంబరీషుడు ఎంత గాలించినా యజ్ఞపశువు దొరకలేదు. ఎవరైనా యజ్ఞపశువుగా తోడ్పడితే యాగం పూర్తవుతుందనుకున్నాడు. కానీ బలవంతం చేయదలచలేదు. విశ్వామిత్రుని సోదరి సత్యవతి భర్త రుచీకమహర్షి. వీరికి ముగ్గురు కుమారులు. వారికి తన సమస్యను చెప్పి, యజ్ఞపరిసమాప్తి కోసం ఓ పుత్రుణ్ణిస్తే లక్ష గోవుల్ని ఇస్తానన్నాడు అంబరీషుడు. ‘నువ్వేమిచ్చినా నా పెద్దకొడుకునివ్వను’ అన్నాడు రుచీకుడు. అతడి భార్య ఆఖరి కొడుకునివ్వనంది.

‘నేను మధ్యవాణ్ణి కనుక తల్లిదండ్రులిద్దరికీ పనికిరానన్నమాట!’ అని రెండోకొడుకు శునశ్శేఫుడు బాధపడ్డాడు. ‘కనీసం రాజునీ, యజ్ఞాన్నీ రక్షించినవాణ్ణవుతాను’ అనుకుని అంబరీషుని వెంట యజ్ఞపశువుగా బయల్దేరాడు. మధ్యాహ్నానికి పుష్కరతీర్థం చేరగా రాజు విశ్రమించాడు. తన మేనమామ విశ్వామిత్రుడు అక్కడే ఉండటంతో శునశ్శేఫుడు ‘మామా! రాజు కోరిక నెరవేరేట్టు, నేను దీర్ఘాయుష్షుతో ఉండేట్టూ దీవించు! తపస్సు చేసి స్వర్గానికెళ్లాలని ఉంది’ అన్నాడు.

విశ్వామిత్రుడు పుత్రులను పిలిచి ‘మీలో ఎవరైనా ఇతడికి ప్రాణభిక్ష పెట్టి, నాకు ప్రీతి, యజ్ఞపశువుగా అగ్నికి తృప్తి కలిగించండి. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయితే రాజే కాదు, దేవతలూ ఆనందిస్తారు’ అన్నాడు. అందుకు పుత్రులు హేళనచేశారు. దాంతో కోపగించి, వారిని ముష్టికజాతివారై పొమ్మని శపించాడు విశ్వామిత్రుడు. శునశ్శేఫుని భయపడొద్దంటూ మంత్రించిన విభూతి పెట్టాడు. యూపానికి కట్టినపుడు అగ్నిని చూసి పఠించమంటూ రెండు మంత్రాలు ఉపదేశించి, ‘యజ్ఞమూ సఫలమౌతుంది, నీ ప్రాణాలూ నిలబడతాయి’ అన్నాడు.

అంబరీషుడు యజ్ఞం కొనసాగించాడు. బలి సమయానికి శునశ్శేఫుని అలంకరించి దర్భలతో యూపస్థంభానికి బంధించగా.. విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలను మననం చేశాడు. అవి ఇంద్ర, ఉపేంద్రులవి. పశుభోక్త ఇంద్రుడు. యూపస్థంభం విష్ణువు. కనుక ఇద్దరూ సంతోషించారు. ‘రాజుకి యజ్ఞఫలాన్నీ, ఇతడికి జీవితాన్నీ ఇవ్వు’ అన్నాడు విష్ణువు. సంతృప్తుడైన ఇంద్రుడలాగే చేశాడు.

- రాహుల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని