Published : 21 Jul 2022 00:29 IST

పాంచజన్యం

సుదేవుడు బలరామకృష్ణులను విద్యాభ్యాస నిమిత్తం వారణాసికి పంపించాడు. వారు సాందీపుని వద్ద వేదాలు, రాజనీతి, ధర్మశాస్త్రాలు నేర్చుకున్నారు. 64 కళలను 64 రోజుల్లో నేర్చుకుని గురువుగారికి దక్షిణ ఇవ్వాలనుకున్నారు. అందుకాయన అవసరమైనప్పుడు అడుగుతానన్నాడు. ఒకరోజు బలరామకృష్ణులను పిలిచి ‘నాయనలారా! సముద్రస్నానానికి వెళ్లి తిరిగిరాని నా పుత్రుణ్ణి తీసుకొచ్చి గురుదక్షిణగా సమర్పించండి’ అన్నాడు సాందీపుడు. వాళ్లెంత వెతికినా ప్రయోజనం లేక సముద్రుణ్ణి అడగ్గా ‘మీ గురుపుత్రుడు స్నానం చేస్తుండగా ఓ కెరటం కబళించింది’ అన్నాడు.

అక్కడికెళ్తే మాయాచక్రం ఉంది. దానిమీదికి బంగారు బాణాన్ని వదలగా దాన్ని సృష్టించిన పంచజనుడనే రాక్షసుడు మరణించాడు. కానీ గురుపుత్రుడు లేడక్కడ. కనిపించిన శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. దాంతో యముడు బలరామకృష్ణులను వెనుతిరిగిపొమ్మన్నాడు. కృష్ణుడికి కోపం వచ్చింది. ‘మేం చెప్పేది గనుక వినకపోతే నీ యమలోకాన్నే జయిస్తాం’ అన్నాడు. వారిని శివ విష్ణు స్వరూపులుగా గ్రహించిన యముడు బ్రహ్మదేవుని ఆనతితో సాందీపుని పుత్రుణ్ణి ఇచ్చేశాడు. అతణ్ణి గురువుకు అప్పగించి, అక్కడ దొరికిన శంఖాన్ని ఇవ్వబోగా ‘ఈ పాంచజన్యం, నా మాయాసృష్టి. ఇది ఉన్నచోట అపాయాలకు తావు లేదు. ఆరోగ్యదాయిని. ధర్మాన్ని నిలబెడుతుంది. సుఖసంతోషాలను ఇస్తుంది’ అంటూ ఇద్దర్నీ దీవించాడు. ఆ పాంచజన్యమే పాండవులకు విజయాన్ని చేకూర్చింది.

- నాగలక్ష్మీ శ్రీప్రద అగ్నిహోత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని