Published : 28 Jul 2022 01:15 IST

తలకిందుల స్వర్గం

ఇక్ష్వాకు రాజు త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్లాలనుకున్నాడు. కులగురువు వశిష్ఠుడు అది అసాధ్యమన్నాడు. త్రిశంకువు ఆయనపుత్రులను అదే అడిగాడు.  తండ్రి కాదన్న పని తాము చేస్తే ఆయన్ను అవమానించడమే నన్నారు వశిష్ఠుని వందమంది పుత్రులు. 

‘మరెవ్వరి సాయంతోనైనా అనుకున్నది సాధిస్తాను’ అన్నాడు రాజు. గురుధిక్కారానికి శపించి రూపం మార్చారు గురుపుత్రులు. బ్రహ్మర్షి అయ్యేందుకు తీవ్ర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుణ్ణి శరణువేడాడు త్రిశంకువు.

విశ్వామిత్రుడు ‘యజ్ఞం చేసి స్వర్గానికి పంపుతాను కానీ, నీ రూపాన్ని మాత్రం మార్చలేను’ అన్నాడు. యజ్ఞానికి మును లందరినీ పిలుచుకుని రమ్మని తన కుమారులకు పురమాయించాడు. విశ్వామిత్రునికి భయపడి అంతా వచ్చారు కానీ వశిష్ఠుని పుత్రులు రాకపోగా హేళన చేశారు. అది విని విశ్వామిత్రుడు శపించాడు. హవిర్భాగాలను తీసుకోవ డానికి దేవతలు నిరాకరించగా విశ్వామిత్రుడికి కోపం హెచ్చింది. తన తపశ్శక్తితో రాజుని స్వర్గానికి పంప దలచాడు. వశిష్ఠపుత్రులను శపించడం వలన తన తపశ్శక్తి కొంత నష్టం కాగా మిగిలిన మహిమతో రాజును సశరీరంగా స్వర్గానికి వెళ్లమన్నాడు.

‘గురుపుత్రుల శాపం పొందిన నీకు స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు, కనుక తలకిందులుగా వేళ్లాడు’ అన్నాడు ఇంద్రుడు. అలా కిందికి పడుతున్న త్రిశంకువు రక్షించమంటూ విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. ఆయన రాజుని ఆకాశం మధ్యలోనే నిలిపి, దక్షిణ దిక్కున సప్తర్షులను, కొన్ని నక్షత్రాలను సృష్టించి, దేవతలను కూడా సృష్టించబోయాడు. కానీ మునులూ దేవతలూ వారించారు.

‘ఈ రాజుని స్వర్గంలో నిలబెడతానని మాటిచ్చాను. అందుకోసం నేను సృష్టించిన ఈ స్వర్గాన్ని శాశ్వతంగా ఉండనీయండి’ అన్నాడు. అందుకు సమ్మతించిన దేవతలు త్రిశంకువును అక్కడే స్వర్గసుఖాలను అనుభవించమన్నారు. అందరూ సంతోషించారు.

- తుషార్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని