Published : 04 Aug 2022 01:08 IST

వందల ఏళ్లనాటి వనదేవతల పండుగ

కొన్ని ఆదివాసీ సంప్రదాయాలు, పండుగలు కొంత వింతగా ఉంటాయి. వీటి వెనుక ఏమున్నదో తెలుసుకుంటే శాస్త్రీయతకు దర్పణం పట్టే కోణాలు కనిపిస్తాయి. లంబాడీ తెగ అధికంగా ఉండే కరీంనగర్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆషాఢ, శ్రావణ మాసాల్లో తీజ్‌ ఉత్సవాలు జరుగుతాయి. ఇది పెళ్లికాని ఆడపిల్లలు చేసే తొమ్మిది రోజుల పండుగ. అడవిలోని చెట్టూచేమా, పొలమూపుట్రా బాగుండాలని, తమను కాపాడాలని సప్త దేవతలను సమ్మేళనంగా పూజిస్తారు. తండాపెద్ద ఒక తేదీని సూచిస్తాడు. ఆరోజు పురుషులు అడవికి వెళ్లి నారలు తెచ్చి బుట్టలు అల్లుతారు. యువతులు బుట్టల్లో మట్టి పోసి తాము ముందు రాత్రి నానబెట్టిన శనగలు, గోధుమలను నాటుతారు. ఆరోజు నుంచి 9 రోజుల పాటు నవధాన్యాలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. పైరు ఎంత ఎత్తుగా పెరిగితే అంత సుఖసంతోషాలతో తండా వెలిగిపోతుందని ఆదివాసీˆల నమ్మకం. తొమ్మిదోరోజు తీజ్‌ దేవతను గంగలో నిమజ్జనం చేసేముందు గ్రామ శివార్లలో కొలువైన సప్త దేవతల గుడికి వెళ్తారు. మందిరమంటే ఇటుక కట్టడమో, శిల్పకళలతో ప్రజ్వరిల్లేదో కాదు. చింతచెట్టు కింద వరుసగా పేర్చిన 9 రాతి విగ్రహాలనే దేవతలుగా పూజిస్తారు. ఈ 9 రోజులూ ఆడపిల్లలు మాంసం, ఉల్లి, మిరప లాంటివి త్యజిస్తారు. అణకువగా ఉండి, సంప్రదాయాలను గౌరవించే అమ్మాయిలను గమనించిన పెద్దలు అక్కడిక్కడే పెళ్లి సంబంధాలు మాట్లాడతారు. సాయంత్రం శనగలూ గోధుమలూ నాటిన బుట్టలను దగ్గర్లో ఉన్న కొలను లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగలో పాల్గొన్న పెళ్లికాని అమ్మాయిలకు సత్వరం మంచి వరుడు వస్తాడని నమ్ముతారు. మంగళవారాన్ని శుభసూచకంగా భావించే లంబాడీలు పండుగను మంగళవారంనాడు ఆరంభిస్తారు.

- తోనంగి శారద


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts