ఇది అల్లాహ్‌ నెల

ఇస్లామిక్‌ నెలల్లో మొదటిది ముహర్రమ్‌. నెలవంక దర్శనంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ నెల విశిష్టత గురించి దివ్యఖురాన్‌లో వివరంగా ఉంది. రంజాన్‌తో పాటు వేరే ఏ నెలలో ఉపవాసాలు పాటించాలని ఒక శిష్యుడు అడగ్గా, మహాప్రవక్త (స) ‘ఉపవాసాలు పాటించదలచినవారు

Published : 04 Aug 2022 01:08 IST

(ఆగస్టు 9 ముహర్రమ్‌)

ఇస్లామిక్‌ నెలల్లో మొదటిది ముహర్రమ్‌. నెలవంక దర్శనంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ నెల విశిష్టత గురించి దివ్యఖురాన్‌లో వివరంగా ఉంది. రంజాన్‌తో పాటు వేరే ఏ నెలలో ఉపవాసాలు పాటించాలని ఒక శిష్యుడు అడగ్గా, మహాప్రవక్త (స) ‘ఉపవాసాలు పాటించదలచినవారు రంజాన్‌ తర్వాత ముహర్రమ్‌లోనూ పాటించండి. ఎందుకంటే ఇది అల్లాహ్‌ నెల. ఆషూరా రోజు ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది’ అంటూ సెలవిచ్చారు. యౌమె ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత ఏడాది చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ నెల పదో రోజును ‘యౌమే ఆషూరా’ అంటారు. ఇస్లాం చరిత్రలో పవిత్రమైన ఆ రోజే హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (రజి) అమరులయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఆయన పరివారం కూడా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది. దుర్మార్గాలూ, దౌర్జన్యాలపై రాజీలేని పోరాటాలు చేయాలంటూ కర్బలా ఘటన పాఠాన్ని నేర్పుతుంది. శతాబ్దాల క్రితం న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడిన ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటారు.

ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన ఇమామె హుసైన్‌ (రజి) సూక్తులు :
‘స్వర్గాన్ని చూడాలనుకుంటే అమ్మ ఒడిలో తలపెట్టి పడుకోండి’, ‘నేలమీద వినమ్రంగా జీవించండి. చనిపోయాక నేలకింద హాయిగా ఉండొచ్చు’, ‘దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అలాంటి వారిపై దౌర్జన్యం చేయకండి’, ‘నాకు స్వర్గం కంటే నమాజ్‌ అంటేనే ప్రీతి. ఎందుకంటే, అల్లాహ్‌కు కూడా నమాజే ఇష్టం’, ‘దేహానికి మరణం తప్పదు. అలాంటప్పుడు జీవితాన్ని ప్రసాదించిన దైవం కోసం ప్రాణాలర్పించడమే మేలు’, ‘మీ మనో న్యాయ స్థానంలోకి వెళ్తూ ఉండండి. అక్కడ తప్పుడు తీర్పులు ఉండవు’, ‘దైవదాస్యం చేసేవారికి లోకంలో ప్రతిదీ బానిసవుతుంది. దైవభీతితో గౌరవమర్యాదలను సాధించండి’                

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని