Updated : 11 Aug 2022 04:23 IST

రక్షే లక్ష్యం.. బంధమే ఆనందం..

ఆగస్టు 12 రాఖీ

త్మీయతానురాల సవ్వడి, సోదర ప్రేమకు కట్టిన గుడి రక్షాబంధన్‌ పర్వదినం. తోబుట్టువు తన జీవితానికి పెట్టని కోటగా ఉన్నప్పుడు తనవంతు కర్తవ్యంగా ఆమె రక్షణ అతడి ధర్మం. ఈ ధర్మ పరిరక్షణ ప్రబోధమే రాఖీ. శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్‌ జరుపుకోవటం సంప్రదాయం. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు చేపట్టే ప్రతి పనీ విజయవంతం కావాలని సోదరి ఆశిస్తుంది. సోదరుడికి ‘రక్ష’ను కడితే, సోదరికి రక్షగా నిలుస్తానని, ఆమె జీవితం తియ్యగా సాగాలని మిఠాయి తినిపిస్తాడతను. నిజానికి ఈ పండుగ ఆనవాళ్లు యుగాల కిందటే ఉన్నాయి. దీనిక సంబంధించి పురాణ సంబంధంగా శ్రీకృష్ణుడు సుభద్రను, ద్రౌపదిని సందర్భానుసారంగా ఆదుకున్నది ఆ చెల్లెమ్మలు కట్టిన రక్షల వల్లనే అనే అనూచాన కథలున్నాయి. అయితే ఇది కేవలం అన్నాచెల్లెళ్లమధ్యనే కాదు, భార్యాభర్తల నడుమ కూడా ఉన్న రక్ష అని శచీదేవి ఇంద్రుల కథ వివరిస్తుంది. అందుకే రక్షా బంధన సమయంలో ఈ మంత్రాన్ని చదువుతుంటారు. ఓ సారి దేవతలు, రాక్షసులకు యుద్ధం జరిగింది. అందులో ఇంద్రుడు గెలవాలని శచీదేవి రక్ష కట్టింది. ఆ రక్షా ప్రభావంతో ఇంద్రుడు గెలిచాడు. ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల’ రక్ష కట్టేటప్పుడు చదివే మంత్రమిది. రక్షలో విష్ణుశక్తి ఉంటుందన్నది ఈ మంత్ర సారం. చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని దిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. దాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమేశాడని, నాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకొచ్చిందని అంటారు.

- డాక్టర్‌ యల్లాప్రగాడ మల్లికార్జున రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని