అతడు నమస్కారానికి అనర్హుడు

మాండకర్ణి కల్పించిన సరస్సు పంచాప్సరంగా ప్రసిద్ధమైంది. యోజనం వైశాల్యంతో, తామరపూలు, హంసలతో అందంగా ఉంటుందది. అక్కడ మనుషుల్లేకున్నా సంగీతం వినిపిస్తుంటుంది. మాండకర్ణి పదివేల సంవత్సరాలు కొలనులోనే ఉండి తపస్సు చేశాడు.

Updated : 11 Aug 2022 01:20 IST

మాండకర్ణి కల్పించిన సరస్సు పంచాప్సరంగా ప్రసిద్ధమైంది. యోజనం వైశాల్యంతో, తామరపూలు, హంసలతో అందంగా ఉంటుందది. అక్కడ మనుషుల్లేకున్నా సంగీతం వినిపిస్తుంటుంది. మాండకర్ణి పదివేల సంవత్సరాలు కొలనులోనే ఉండి తపస్సు చేశాడు. కొన్నాళ్లు నీళ్లు మాత్రమే తాగాడు. కొన్నాళ్లు గాలినే ఆహారంగా తీసుకున్నాడు. తమలో ఎవరి పదవిని ఆశించి అంతటి కఠోరదీక్ష చేస్తున్నాడో అనుకున్న దేవతలు తపస్సుని భగ్నం చేయాలనుకున్నారు. మాండకర్ణి కామాన్ని జయించలేదని అర్థమయ్యాక ఐదుగురు అప్సరసలని పంపారు. ఆత్మసాక్షాత్కారం, భగవత్‌ సాక్షాత్కారం కూడా పొందిన ముని వారి అందచందాలకు మోహితుడై భార్యలుగా చేసుకున్నాడు. వారి కోసం కొలనులోనే గృహాన్ని నిర్మించాడు. యోగబలంతో యవ్వనం పొంది సంతోషంగా క్రీడిస్తున్నప్పుడు వారి ఆటపాటల ధ్వనులు వినిపిస్తుంటాయి. పంచాప్సర కొలను చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు. వారి వెంట ధర్మభృతుడున్నాడు. ‘మునివర్యా! ఎవరూ లేకుండానే ఈ ధ్వనులేమిటో తెలుసుకోవాలనుంది. అది రహస్యం కాకుండా, మేం వినతగినదైతే చెప్పండి’ అన్నారు. దాంతో ధర్మభృతుడు జరిగిందంతా చెప్పాడు.

అరణ్యవాసంలో మహర్షుల ఆశ్రమాలను దర్శించి, వారి సేవ చేసుకున్న శ్రీరాముడు ఆ ముని వద్దకు మాత్రం వెళ్లలేదు. ఎంతటి యోగులైనా, కామవశులైతే నమస్కారానికి అర్హులు కారు. సాధన ఫలితంగా లౌకిక భోగాలు పొందితే ఉత్తమలోకాలకు వెళ్లేందుకు సంపాదించుకున్న పుణ్యఫలం ఖర్చయిపోతుంది. ఉత్తమ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నవారు అల్పవిషయాలకు ప్రలోభం చెందరు.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని