తనకు మాలిన ధర్మం

సద్గుణసంపన్నుడిగా పేరుతెచ్చుకున్న ఓ పెద్దమనిషి కుటుంబంతో తీర్థయాత్రకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో అందరికీ దాహమేసింది. తెచ్చుకున్న నీళ్లు ఐపోయాయి. వేసవి కావడంతో పిల్లలు వేడికి తాళలేక పోయారు.

Updated : 11 Aug 2022 01:17 IST

ద్గుణసంపన్నుడిగా పేరుతెచ్చుకున్న ఓ పెద్దమనిషి కుటుంబంతో తీర్థయాత్రకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో అందరికీ దాహమేసింది. తెచ్చుకున్న నీళ్లు ఐపోయాయి. వేసవి కావడంతో పిల్లలు వేడికి తాళలేక పోయారు. అక్కడ ధ్యానంలో ఉన్న మునిని నీళ్ల గురించి వాకబుచేయగా ‘ఇక్కడికి మైలు దూరంలో ఓ నది ప్రవహిస్తోంది’ అన్నాడాయన. అతడు సంతోషించి, భార్యాపిల్లలను అక్కడే ఉండమని తాను వెళ్లాడు. నీళ్లతో తిరిగొస్తుండగా, ఐదుగురు వ్యక్తులు కనిపించి తమకు చాలా దాహంగా ఉందని నీళ్లడిగారు. తెచ్చిన నీటిని వారికిచ్చి, మళ్లీ నదికి వెళ్లాడు. ఈసారి కూడా మరికొందరు దాహార్తితో ఎదురవగా నీళ్లు ఇచ్చేశాడు. మరోసారి నీళ్లు తీసుకుని వచ్చేసరికి, కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడు ముని వద్దకు వెళ్లి ‘నా కుటుంబమిలా ఉండటానికి నేనేం పాపం చేశాను? ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం ధర్మమని నమ్మి పాటించాను కదా! మా వాళ్లని కాపాడండి స్వామీ’ అన్నాడు దుఃఖిస్తూ. ముని తల పంకించి ‘నువ్వు సజ్జనుడివే, కానీ కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యమెందుకు? నేను చూపిన మార్గంలోనూ ధర్మాన్ని పాటించవచ్చు. నీళ్లు ఇచ్చే బదులు నీటి జాడ చెబితే అందరి దాహమూ తీరేది’ అన్నాడు. తనకుమాలిన ధర్మం అవసరంలేదని ఒప్పుకున్నాడతను.

- బుడుబుడుకల విశాల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని