Published : 18 Aug 2022 01:22 IST

శాంతమే భూషణం

కసారి హరిశ్చంద్రుడు వరుణయాగం తలపెట్టాడు. ఆ యాగానికి బలిపశువు కావాలి. శునశ్శేఫుడనే బాలుడి తండ్రికి ధనాశ చూపి బలిగా నిర్ణయించాడు. తీరా బలి సమయానికి బాలుడికి అర్థమై శోకాలుపెట్టాడు. ఆ దారిన వెళ్తున్న విశ్వామిత్రుడు జాలిపడి ‘ముక్కుపచ్చలారని బాలుణ్ణి బలి ఇస్తావా? అతణ్ణి విడిచి పెట్టు’ అన్నాడు. హరిశ్చంద్రుడు ససేమిరా అనడంతో విశ్వామిత్రుడు బాలుడికి వరుణ మంత్రం ఉపదేశించాడు.

వరుణుడు ప్రసన్నుడై శునశ్శేఫుణ్ణి బలి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే యాగఫలాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచీ విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు తనమాట వినలేదని కోపం. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకసారి హరిశ్చంద్రుడు కౌశికీ నదీతీరంలో వేటాడుతున్నాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వరం అడిగాడు. హరిశ్చంద్రుడు ఏం కావాలో కోరుకోమనగా సామ్రాజ్యం మొత్తాన్నీ దానం చేయమన్నాడు. అలా హరిశ్చంద్రుడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటమే కాకుండా అతడి భార్యాబిడ్డల్ని అడవులపాలు చేసి ముప్పతిప్పలు పెట్టాడు విశ్వామిత్రుడు.

హరిశ్చంద్రుడికి పురోహితుడైన వశిష్టుడికి తమ రాజుని మోసగించిన విశ్వామిత్రుడి మీద అంతులేని కోపం వచ్చింది. ‘నమ్మించి మోసగించి సకల సామ్రాజ్యం సాధించావు. ఈ అకార్యానికి కొంగవైపో!’ అని శపించాడు.

‘నీకు చెందని విషయంలో వేలు పెడతావా! నువ్వు బాతువైపో!’ అని ప్రతిశాపం ఇచ్చాడు విశ్వామిత్రుడు. దాంతో ఇద్దరూ మానస సరోవర తీరంలో కొంగ, బాతులుగా జన్మించి, ఏళ్ల తరబడి పోరు సాగించారు. ఆ భయంకర పోరాటం ఎంతకీ అంతమవకపోవటంతో దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ వారి శాపాలను అంతమొందించి ‘శక్తిమంతులకు కోపం వస్తే ఇలాంటి అనర్థాలకే దారితీస్తాయి. శాంతమే సర్వసంగులకు ఆభరణం’ అని సుద్దులు చెప్పి, ఎవరి స్థానాలకు వారిని పంపేశాడు.

- గోనుగుంట మురళీకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని