ఆధ్యాత్మిక మహర్షి

ఆధ్యాత్మికవేత్తల్లో రామకృష్ణ పరమ హంసకు ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడు తప్ప తక్కినదంతా మిధ్య అని ఆయన బోధనలతో అర్థ మవుతుంది.

Updated : 08 Sep 2022 01:08 IST

ధ్యాత్మికవేత్తల్లో రామకృష్ణ పరమ హంసకు ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడు తప్ప తక్కినదంతా మిధ్య అని ఆయన బోధనలతో అర్థ మవుతుంది. బాల్యంనుంచీ భక్తి ఎక్కువ. పిన్న వయసు లోనే దక్షిణేశ్వరం కాళీమాత ఆలయంలో అర్చకులు అయ్యారు. నిరంతరం గుడిలోనే ఉంటూ దేవీ ధ్యానంలో లీనమయ్యేవారు. ఒకరోజు రాణీ రాన్మణీదేవి అర్చన చేయించుకునేందుకు గుడికి వచ్చింది. ఆమె కోరికపై రామకృష్ణులు భక్తిగీతాలు పాడుతున్నారు. ఆమె ఓ మూల కూర్చుని పూలమాల కడుతోంది. ఇంతలో ఆయన ఒక్కసారిగా లేచి ‘ఇక్కడ కూడా ఆలోచనలేనా?’ అని గద్దించారు. ఆమెతోబాటు అక్కడున్న అందరూ ఉలిక్కిపడ్డారు. అప్పుడామె న్యాయస్థానంలో నడుస్తున్న వ్యాజ్యాల గురించి నెమరేయడం అంతర్‌ దృష్టితో గ్రహించారాయన. సాక్షాత్తు కాళీమాతే పరమహంస రూపంలో కోప్పడినట్టు భావించి, తల వంచుకుందామె.

రామకృష్ణులు అమ్మవారి ఎదుట నిలిచి ‘అమ్మా! ఈ స్వల్ప జీవితకాలంలో మరోరోజు గడిచి పోయింది. నీ దర్శనభాగ్యం మాత్రం లభించలేదు’ అంటూ మొరపెట్టుకునేవారు. కొంతకాలానికి దేవి కనికరించింది. ప్రకాశవంతమైన ఓ ఉత్తుంగ తరంగం ఆయనవైపు దూసుకురాగా అలా చూస్తుండి పోయారు. ఆ ప్రకాశమే దివ్యజనని అంటూ ఓ సందర్భంలో శిష్యగణానికి తెలియజేశారు.

ఆయన ఉపదేశాలు మనలో లౌకిక వాసనల్ని చెరిపేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తాయి. ‘ఈశ్వర ప్రాప్తి కలగనంతవరకు దేవుడి విషయమై వ్యర్థ వాదనలు చేసిన వ్యక్తి స్వామి అనుగ్రహం ప్రాప్తించాక బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఏ మార్గంలో వెళ్లినా ఏ నామంతో కొలిచినా సచ్చిదానందుడికి చేరువవటం తథ్యం. గంగాజలాన్ని సాధారణ జలంగా పరిగణించ కూడదు. బృందావనంలోని మృత్తికను సాధారణ మట్టిగా తలవకూడదు. అలాగే జగన్నాథ ప్రసాదం కేవలం అన్నం కాదు. ఈ మూడూ సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపాలే’ అంటూ చెప్పేవారు. భగవత్‌ ప్రబోధలతోబాటు మృత్యువు, పునర్జన్మ, ధర్మార్థకామమోక్షాల వివరణ, ధ్యానం, సమాధి స్థితి తదితర అంశాలను తేటతెల్లం చేసిన ఆధ్యాత్మిక మహర్షి రామకృష్ణులు.

- శ్రీమయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని