దేహధర్మం

గౌతమబుద్ధుడి కాలంలో చంపానగరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజు మహా సౌందర్యవంతుడు. అతడు తన అందచందాలను చూసుకుని మహా గర్వపడేవాడు.

Updated : 08 Sep 2022 01:10 IST

గౌతమబుద్ధుడి కాలంలో చంపానగరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజు మహా సౌందర్యవంతుడు. అతడు తన అందచందాలను చూసుకుని మహా గర్వపడేవాడు. ఆ అహంకారంతో అందరినీ అవమానించేవాడు. గౌతముడు దేశాటనలో భాగంగా ఒకసారి చంపానగరికి వచ్చాడు. ఆ రాజు తథాగతుడి ఉపదేశాలు వినాలని గాక, ఆయన ముందు తన అందాన్ని ప్రదర్శించి, తన ప్రత్యేకతను చూపాలని వచ్చాడు. కొద్దిసేపటికి అశాశ్వతమైన శరీరం గురించి బుద్ధుని ప్రవచనం విని ఒక్కసారిగా అంతర్మథనం చెందాడు. శరీరాన్ని కష్టపెట్టేందుకు ముళ్ల ఆసనం మీద కూర్చుని తపస్సు చేయడం ఆరంభించాడు. శరీరం నుంచి రక్తపుధారలు కారసాగాయి. అయినా అలా బాధపడుతూనే తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు గౌతముడు ఆ రాకుమారుడి దగ్గరకు వచ్చి ‘నువ్వెప్పుడైనా వీణను వాయించావా?’ అనడిగాడు. అవునన్నట్లు తలూపాడు రాజు. ‘వీణ తీగలు వదులుగా ఉంటే స్వరం పలుకుతుందా?’ తిరిగి ప్రశ్నించాడు గౌతముడు. లేదని బదులిచ్చాడు రాజు. ‘మరి తీగలు బిగించావనుకో! అప్పుడు స్వరం బాగా పలుకుతుందా?’ అని కళ్లలోకి చూస్తూ అడిగాడు. ‘తీగలు తెగిపోతాయి, స్వరం పలకనే పలకదు’ జవాబిచ్చాడు రాజు. అప్పుడాయన ‘నాయనా! ఈ సూత్రం శరీరానికీ వర్తిస్తుంది. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. ఎక్కువ కష్టపెట్టినా, మరీ సుఖపెట్టినా దాని ధర్మం అది సరిగ్గా నిర్వర్తించలేదు. శారీరక శక్తి సామర్థ్యాలను బట్టి క్రమంగా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటుచేయాలి. పూర్తిగా పస్తులూ ఉంచకూడదు. అతిగా భోగించనీయకూడదు. మధ్యేమార్గాన్ని అవలంబించాలి’ అంటూ నవ్వారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని