సోదరవైరం

అమృతం తెచ్చి సవతితల్లి కద్రువకిచ్చి తల్లిని దాస్యవిముక్తురాలిని చేసేందుకు బయల్దేరాడు గరుత్మంతుడు. బలం కలిగే ఆహారం ప్రసాదించమని అడిగాడు.

Updated : 08 Sep 2022 01:06 IST

మృతం తెచ్చి సవతితల్లి కద్రువకిచ్చి తల్లిని దాస్యవిముక్తురాలిని చేసేందుకు బయల్దేరాడు గరుత్మంతుడు. బలం కలిగే ఆహారం ప్రసాదించమని అడిగాడు. దానికి వినత ‘సముద్రగర్భంలో లోకకంటక మైన నిషాదగణం ఉంది. దాన్ని నిమిషంలో తిని వెళ్లు’ అంది. ఆమె మాట పాటించి, తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్లి ‘నా తల్లి దాస్యాన్ని తొలగించేందుకు, పాములకు అమృతం తేవాలని వెళ్తున్నాను. ఆకలి తీరలేదు. మరేదైనా ఆహారాన్ని అనుగ్రహించు’ అన్నాడు. కశ్యపుడో కథ చెప్పాడు. ‘నీకు ఆహారాన్ని అనుగ్రహించడమే కాదు, సోదరవైరం ఎంత ఘోరమో వివరించే కథ చెప్తా విను. ఇద్దరు బ్రాహ్మణ సోదరులున్నారు. వారిలో విభావసుడు నియమనిష్ఠలతో జీవితాన్ని గడుపుతుండగా సుప్రతీకుడు తాతల ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు. విభావసుడికి కోపం వచ్చి ‘ఏనుగువైపో’ అంటూ శపించాడు. సుప్రతీకుడు సోదరుణ్ణి తాబేలుకమ్మంటూ ప్రతిశాపం ఇచ్చాడు. విభావసుడు 6 ఆమడల పొడవు, 12 ఆమడల వెడల్పుతో మహాగజంగా మారి అడవిలో తిరుగుతున్నాడు. సుప్రతీకుడు 3 ఆమడల పొడవు, 10 ఆమడల వెడల్పుతో తాబేలై చెరువులో జీవిస్తున్నాడు. జంతువులుగా మారినా పూర్వజన్మ శతృత్వం మర్చిపోలేదు. తరచు పోట్లాడుకుంటూనే ఉన్నాయవి’ అంటూ చెప్పిన కశ్యపుడు ఆ రెంటినీ తిని ఆకలి తీర్చుకోమన్నాడు.
గరుత్మంతుడు ఒక రెక్కతో ఏనుగును, మరో రెక్కతో తాబేటిని కప్పి, రెండు కాళ్లతో వాటిని నొక్కి పట్టి ఆకాశంలోకి ఎగిరాడు. ఎక్కడ పెట్టుకుని తినాలా- అని ఆలోచిస్తుంటే రోహిణం అనే పెద్దచెట్టు తన కొమ్మల మీద నిలిచి తినమంది. గరుడుడు కొమ్మ మీద నిలవగానే చెట్టుకొమ్మ విరిగింది. వాలఖిల్యులు అనే మునులు ఆ కొమ్మకు వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. ఏనుగు, తాబేలు కింద పడ కుండా ముక్కుతో పట్టుకుని తండ్రిని ఆశ్రయించాడు. ఆయన ప్రార్థించగా మునులు చెట్టుకొమ్మ వదిలి వెళ్లారు. ఆ కొమ్మతో పర్వతం చేరి వాటిని తిని అమృతం కోసం స్వర్గానికి వెళ్లాడు గరుత్మంతుడు.

- తుషార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని