Published : 15 Sep 2022 00:43 IST

శాంతి మంత్రం... క్రాంత దర్శనం

సెప్టెంబర్‌ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం

ఆది నుంచి భారతావని అణువణువూ శాంతి కాముకం. అంతరాలు, ఆటంకాలు, అశాంతి లేని సమాజం కోసమే అందరూ ఒకటవ్వాలన్న సంకల్పంతో ముందడుగేసిన పవిత్ర భూమి ఇది. దేశాలు, నగరాలు ఎల్లలు కాదని, ఆకాశం, అంతరిక్షం, భూలోకం, దేవలోకం.. సర్వత్రా శాంతి వర్ధిల్లాలని, చివరికి శాంతికే శాంతి కలుగుతూ లోకాలన్నీ సుఖంగా ఉండాలన్న ఆకాంక్ష వేదకాలం నుంచి ఉంది.

అందరిలోని అంతరాత్మే పరమాత్మ. ఆ పరతత్వ ఆరాధనే శాంతి సౌధానికి తొలి సోపానమని నినదించారు కవిపండితులు. అది విశ్వవ్యాప్తం కావాలి, ప్రశాంతత వర్ధిల్లాలి అని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఈ అభిలాషకు రుజువేంటి? నిజంగా ఇక్కడ తొలి నాళ్ల నుంచీ అంత శాంతి కాంక్ష వర్ధిల్లిందా? అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతున్నాయి మన శాంతి మంత్రాలు. వేదాలు, పురాణేతిహాసాల నుంచి వచ్చిన ఈ శాంతి మంత్రాలు నిత్యం ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. వాటిని మనసుకు పట్టించుకున్న వారు రుషులవుతారు, మహాపురుషులూ అవుతారు. బౌద్ధ, జైనాలు ఈ బాటలోనే సాగాయి. కోరికలను తుంచి తోటి జీవిని పెంచితే చాలు కోటి రెట్ల శాంతి పరిమళిస్తుందని ఈ పవిత్రావని నుంచే ప్రపంచానికి సందేశం అందింది.

బడి నుంచే వరవడి
పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తయిన తర్వాత పండితులు ఆశీర్వచనం చదువుతారు. గురుకుల విద్యాలయాల్లో గురుశిష్యులు నిత్యం శాంతి మంత్రాలను చదివేవారు. ఇవి మనకే పరిమితం కాదు సకల చరాచర సృష్టిలో శాంతి, సౌభ్రాత్రాలను వృద్ధిచేయడమే లక్ష్యంగా కనిపిస్తాయి.
ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఈ మంత్రంలో సర్వ జీవుల రక్ష, పరిపోషణ, అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలనే సమాజ ఉద్ధరణ, సంకల్పం కనిపిస్తాయి. ‘మన మేధస్సు వృద్ధి చెందుగాక.. విద్వేషాలు రాకుండుగాక’ అనే భావం స్పష్టమవుతుంది. అలాగే మంత్రం చివర ముమ్మారు ‘శాంతిః’ అనడంలో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక- అని మూడు రకాలుగా శాంతి ఉంటుందనే అర్థం దాగి ఉంది.
మొదటి శాంతికి అర్థం ప్రకృతిపరంగా సంభవించే భూకంపం, అగ్నిప్రమాదం, వరదల్లాంటి ఆపదలు కలగకూడదని. రెండో శాంతికి అర్థం మనం, మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు బాగుండాలని, శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కోసం దేవుడి అనుగ్రహం ఉండాలనే ఆకాంక్ష. మూడో శాంతిలో ఇతర జీవరాశుల నుంచి ముప్పు కలగకుండా సురక్షితంగా ఉండాలనే ప్రార్థన. ఇలా అన్ని ఉపద్రవాలనుంచీ రక్షించమని దైవాన్ని వేడుకుంటూ శాంతి పదాన్ని స్మరిస్తాం. సృష్టిలోని అణువణువూ హాయిగా ఉండాలని కోరుకోవటమే మన సంస్కృతీ సంప్రదాయం.

నింగీ నేలా అంతా...
‘ఓం ద్యౌః శాంతిః అంతరిక్షః శాంతిః పృథివీ శాంతిః ఆపా శాంతిః ఓషదయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతి రేవ శాంతిః సామాః శాంతిరేదిః ఓం శాంతిః శాంతిః శాంతిః’ అన్నారు. స్వర్గం, దేవలోకం, ఆకాశం, అంతరిక్షం, భూమి, జలం, ఓషధులు, వనమూలికలు, అన్ని లోకాల్లో, దేవతల్లో, బ్రహ్మలో, సర్వ జనుల్లో శాంతి నెలకొనుగాక- అనేది అర్థం. వ్యక్తిగతంగానే కాక సర్వ ప్రాణులకూ సుఖసంతోషాలనూ, శాంతినీ అనుగ్రహించమని వేడుకోవటం మన సంస్కృతి గొప్పదనం. ఇంతటి శాంతి కాముకత మరెక్కడా కనిపించదు. అందుకే భారతీయత వైపు చూపు నిలుపుతోంది ప్రపంచం.

న్యాయ మార్గం తప్పకూడదు
‘స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు’ అనడంలో శాంతితోపాటు న్యాయ మార్గ వర్తనమూ ఉండి తీరాలనే కాంక్ష ఉంది. ‘ప్రజలకు శుభం కలుగుగాక! ప్రభువులందరూ న్యాయమార్గంలో పాలింతురు గాక! గోవులకు, బ్రహ్మజ్ఞానం కలిగినవాళ్లకు శుభం కలుగుగాక! అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుదురు గాక!’ అనే నిస్వార్థ ఆకాంక్ష ఉంది.

ఆశ.. అశాంతి
వేదమంత్రాలతో పాటు పురాణేతిహాసాల్లో శాంతికాముక కథలు, ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. భారతంలో శాంతి పేరున ఓ పర్వమే ఉంది. భాగవతం వామనావతార ఘట్టంలో ఆశ అంతంలేని పాశమని, దానికి చిక్కితే అశాంతి తప్ప ఏమీ మిగలదన్న సందేశం అందుతుంది. ఇలా చెప్పుకుంటూపోతే మన సారస్వతం అంతా క్రాంత దర్శనంతో భవిష్యత్తరాలన్నీ శాంతిమయం కావాలన్న ఆలోచనతోనే ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. వాటిని అందిపుచ్చుకోవటమే మనందరి కర్తవ్యం.

- డా.యల్లాప్రగడ మల్లికార్జున రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు