మేఘసందేశం

దానగుణమే మానవత్వానికి గీటురాయి. స్వార్థం లేకుండా చేసే దానధర్మాలే మనిషికి తోడూ నీడగా ఉంటాయి. ఇహపరసాధనకు చేదోడువాదోడు అవుతాయి. దానం గురించి ధర్మ రాజుకు ..

Published : 22 Sep 2022 00:31 IST

దానగుణమే మానవత్వానికి గీటురాయి. స్వార్థం లేకుండా చేసే దానధర్మాలే మనిషికి తోడూ నీడగా ఉంటాయి. ఇహపరసాధనకు చేదోడువాదోడు అవుతాయి. దానం గురించి ధర్మ రాజుకు మార్కండేయ మహర్షి చక్కని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఆచరించే మానవ జీవితమే ధన్యమవుతుంది. శిబి చక్రవర్తిని మించిన దాత లేడంటారు. అందుకు నిదర్శనంగా మార్కండేయ మహర్షి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. ఉత్తమమైన దానం ఏమిటో ధర్మరాజుకు అర్థమైంది. ఒక చక్రవర్తి పశువుల్ని దానం ఇచ్చాడు కానీ ఆ ఇచ్చినవాడు తానేనన్న విషయం మరవలేకపోయాడు. రెండో చక్రవర్తి ఒక పండితుడికి తన అశ్వాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఎందుకు ఇచ్చానా అని మధనపడ్డాడు. కాగా, తన ప్రియమైన వాహనాన్ని బహుమతిగా ఆ పండితుడు కోరాడని శాపనార్థం పెట్డాడు. నారద మహర్షి తన రథాన్ని మెచ్చుకున్నందుకు సంబరపడి, ఇది తమకే అంకితం అన్నాడు మూడో చక్రవర్తి. మాట వరసకు అలా అన్నాడే కానీ ఇవ్వడానికి మనసు ఒప్పలేదు ఆ చక్రవర్తికి. నారదుడికి అర్థమైంది. ఎవడు స్వధర్మం పాటిస్తూ, దానధర్మాలు చేస్తూ సత్యవ్రతుడై, సన్మార్గంలో జీవనం సాగిస్తాడో అతడే మహాత్ముడు. ఈ జన్మలో ఇతరుల శ్రేయస్సు కోసం దానం చేస్తే మరుజన్మలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. అందుకు భిన్నంగా స్వార్థంతో దుర్మార్గ రీతిలో ధనం సంపాదించుకున్నా, ఈ జన్మలోనే కాదు, మరు జన్మలో కూడా ప్రశాంతంగా బతకలేరు. ధర్మవిరుద్ధంగా నడిస్తే పెద్ద శిక్షే పడుతుంది. అందువల్ల దయాగుణం, దానగుణం, దమ్యత (ఇంద్రియ నిగ్రహం) ఉండాలంటూ ప్రజాపతి తన శిష్యులకు బోధించాడు. ఆ సమయంలో ఆకాశంలో కారుమేఘం ద,ద,ద, అని మూడుసార్లు ఉరిమింది. అదే మేఘసందేశం!

- ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని